పెరుగుతున్న నిత్యావసర ధరలను నియంత్రించాలి…

బోధన్‌లో సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ధర్నా
బోధన్, అక్టోబర్ 06 ద్రోణ:- ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ (ప్రజాపంథా) ఆధ్వర్యంలో మంగళవారం బోధన్‌లో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. మహాలక్ష్మి మందిరం నుంచి ప్రారంభమైన ర్యాలీ షర్బత్ కెనాల్, అంబేద్కర్ చౌరస్తా, రైల్వే గేట్, మున్సిపల్ కార్యాలయం మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు సాగింది. అనంతరం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతిపత్రంతో పాటు ప్రజల వ్యక్తిగత దరఖాస్తులను అధికారులకు అందజేశారు.

ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుడు ఎం. నరేందర్, జిల్లా సీనియర్ నాయకుడు కే. గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అర్హులైన వారందరికీ చేయూత పింఛన్లు అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించి ప్రజలపై భారాన్ని తగ్గించాలని కోరారు. రైతులకు నాణ్యమైన, కోతలు లేని విద్యుత్ సరఫరా చేయడంతో పాటు రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల హామీల అమలులో జాప్యం జరిగితే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

డివిజన్ కార్యదర్శి డి. రాజేశ్వర్, సహాయ కార్యదర్శి బి. మల్లేష్ మాట్లాడుతూ కార్మికుల వేతనాలు పెరగకపోవడం, సంక్షేమ పథకాల అమలులో జాప్యం, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోందన్నారు. ప్రజలు, కార్మికులపై పన్నుల భారాన్ని పెంచే విధానాలను విడనాడాలని కోరారు. దేశ సంపద కొద్దిమంది కార్పొరేట్ శక్తులకే పరిమితమయ్యే విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ బోధన్ మండల కార్యదర్శి పడాల శంకర్, ప్రగతిశీల మహిళా సంఘం పట్టణ అధ్యక్షురాలు బి. నాగమణి, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జి. సీతారాం, ఓడ్డెన్న, ఎస్.కే. నజీర్, జి. రాములు, దేవయ్య, బి. సాయిలు, గంగారాం, సలీం, మోహన్, డి. నాగేశ్వర్, నరేష్ తదితర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.