తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలకు రెక్కలు

నాలుగు నెలల్లో సన్నబియ్యం ధర రూ.55 నుంచి రూ.83కు…

దిగుబడి తగ్గుదలతో పెరుగుతున్న భారం

హైఅదరాబాద్‌ అక్టోబర్ 05 ద్రోణ:- తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. గత నాలుగు నెలలుగా బియ్యం ధరలు గణనీయంగా పెరగడంతో మధ్యతరగతి, పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. సన్నబియ్యం ధర కిలోకు రూ.55 నుంచి ఏకంగా రూ.83కు చేరినట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. నాణ్యత తక్కువగా ఉండే బియ్యం ధరలు సైతం కిలోకు రూ.60కు పైగానే పలుకుతున్నాయి. బియ్యం ధరల పెరుగుదలకు పలు కారణాలు ఉన్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో వర్షపాతం తగ్గడం, ధాన్యం దిగుబడి తగ్గడం, యాసంగి సాగు విస్తీర్ణం తగ్గిపోవడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. దీనికి తోడు పొరుగు రాష్ట్రాల నుంచి బియ్యానికి డిమాండ్‌ పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నట్లు చెబుతున్నారు.

అక్రమాలపై ఆరోపణలు

మరోవైపు ధాన్యం, బియ్యం నిల్వల నిర్వహణలో కొందరు మిల్లర్ల అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టడం, రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ చేయడం వంటి పరిణామాలు కూడా బియ్యం మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా సమగ్ర విచారణ, నిర్ధారణ అవసరమని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

సామాన్యులపై అదనపు భారం

ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు బియ్యం ధరలు మరింత భారంగా మారాయి. ముఖ్యంగా సన్నబియ్యం వినియోగించే కుటుంబాల నెలవారీ ఆహార బడ్జెట్‌పై గణనీయమైన ప్రభావం పడుతోంది. ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేసి మార్కెట్‌ను నియంత్రించడంతో పాటు అక్రమ నిల్వలు, రేషన్‌ బియ్యం పక్కదారి వంటి అంశాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular