ఎర్రవల్లి భూముల లెక్కలో 45 ఎకరాల తేడా

సర్వే నంబర్‌ 325లో 388 ఎకరాలకు

బదులు 343 ఎకరాలే గుర్తింపు….

మిగిలిన భూమి ఆచూకీపై అధికారుల ఆరా

హైదరాబాద్‌, అక్టోబర్‌ 07ద్రోణ :- సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల పరిధిలోని భూముల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 325లో రికార్డుల ప్రకారం 388 ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా.. రెవెన్యూ అధికారులు చేపట్టిన క్షేత్రస్థాయి సర్వేలో 343 ఎకరాలు మాత్రమే గుర్తించారు. దీంతో రికార్డులకు, క్షేత్రస్థాయి పరిస్థితికి మధ్య 45 ఎకరాల వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ 45 ఎకరాల భూమి ఎక్కడ ఉందో, దాని హద్దులు ఏమిటో నిర్ధారించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల్లో సమగ్ర సరిహద్దు సర్వే చేపట్టేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని సూచించారు. ఈ వ్యవహారంపై మంగళవారం రాత్రి అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం పలు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

సర్వే నంబర్‌ 325కు సమీపంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన భూములు ఉండటంతో.. సంబంధిత భూ రికార్డులను సమర్పించాలని వారికి నోటీసులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, 45 ఎకరాలు కేసీఆర్‌ ఫాంహౌస్‌లోనే ఉన్నాయని లేదా ఆయన కుటుంబం ఆక్రమించుకున్నదని అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఆ భూమి ఆచూకీ, హద్దులు, యాజమాన్యానికి సంబంధించిన అంశాలు తదుపరి సర్వే, రికార్డుల పరిశీలనతో తేలాల్సి ఉంది.

మరోవైపు, సర్వే నంబర్‌ 325లో గుర్తించే భూమిని అర్హులైన స్థానిక రైతులకు పంపిణీ చేయడంతో పాటు, అమరవీరుల కుటుంబాల కోసం కాలనీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపైనా ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular