టీటీడీ పీఠంపై కొత్త ముఖం..?

శ్రీనివాస రామానుజం పేరు చుట్టూ జోరుగా చర్చ….

నవంబర్‌ 7తో బీఆర్‌ నాయుడు పదవీకాలం పూర్తి

తిరుమల, అక్టోబర్ 05 ద్రోణ :- కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి తదుపరి చైర్మన్‌ ఎవరనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బీఆర్‌ నాయుడు పదవీకాలం నవంబర్‌ 7తో ముగియనుంది. దీంతో తదుపరి చైర్మన్‌ ఎంపికపై కూటమి వర్గాల్లో కసరత్తు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ.. శ్రీనివాస రామానుజం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

ఎవరీ శ్రీనివాస రామానుజం..

శ్రీనివాస రామానుజంగా ప్రసిద్ధి చెందిన ఆయన అసలు పేరు లోకాద్రినాయుడిగా ప్రచారంలో ఉంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన పారిశ్రామికవేత్తగా కొనసాగడంతో పాటు ఆధ్యాత్మిక రంగంలోనూ పరిచయం ఉన్న వ్యక్తిగా చెబుతున్నారు. రామానుజ సంప్రదాయాన్ని స్వీకరించిన ఆయనకు ‘శ్రీనివాస రామానుజం’ అనే పేరు చిన్న జీయర్‌ స్వామి ద్వారా వచ్చినట్లు సమాచారం. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి దగ్గరగా ఉన్న వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉందని, బీజేపీ అగ్రనేతలతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన ఓ ముఖ్యమైన హోమాన్ని కూడా ఆయన పర్యవేక్షించినట్లు చెబుతున్నారు.

ఆధ్యాత్మిక నేపథ్యానికే ప్రాధాన్యం..?

టీటీడీ ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక సంస్థ. ఇలాంటి సంస్థకు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే వ్యక్తి ఆధ్యాత్మిక నిబద్ధతతో పాటు వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి కావాలనే అభిప్రాయం కూటమి వర్గాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస రామానుజం పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయనకు ఉన్న ఆధ్యాత్మిక నేపథ్యం, వివిధ వర్గాలతో ఉన్న సంబంధాలు, కూటమి నేతలతో సాన్నిహిత్యం తదితర అంశాలు ఆయన పేరును బలపరుస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

వివాదాలకు దూరంగా..

టీటీడీ పాలనను మరింతగా ఆధ్యాత్మికతకు కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు వివాదాలకు తావులేని విధంగా నిర్వహించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాలక మండలి చైర్మన్‌ ఎంపికలోనూ ఆధ్యాత్మిక నేపథ్యానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే శ్రీనివాస రామానుజం నియామకంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. బీఆర్‌ నాయుడు పదవీకాలం నవంబర్‌ 7తో ముగియనున్న నేపథ్యంలో.. ఆ తర్వాత టీటీడీ చైర్మన్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లలో శ్రీనివాస రామానుజం పేరు మాత్రం ముందంజలో ఉన్నట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular