ప్లాస్టిక్ నోట్లకు గ్రీన్ సిగ్నల్!

తొలిదశలో రూ.10, రూ.20 నోట్లపై ప్రయోగాత్మక పరీక్షలు..

మన్నిక పెంచడమే లక్ష్యం

న్యూఢిల్లీ, అక్టోబర్ 07ద్రోణ:- దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక అడుగు వేస్తున్నట్లు సమాచారం. తొలిదశలో రూ.10, రూ.20 విలువ కలిగిన నోట్లపై ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించేందుకు ప్రయోగాత్మక ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్లాస్టిక్ నోట్ల తయారీకి అవసరమైన ప్రత్యేక మెటీరియల్‌ను సరఫరా చేసేందుకు అర్హత కలిగిన సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించే ప్రక్రియను ఆర్బీఐ అనుబంధ సంస్థ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (BRBNMPL) చేపట్టినట్లు సమాచారం.

చిరిగిపోయే నోట్లకు చెక్‌?


ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా తరచూ చేతులు మారే చిన్న విలువ కలిగిన నోట్లు త్వరగా చిరిగిపోవడం, మురికిగా మారడం వంటి సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. నోట్ల జీవితకాలం పెరగడంతో వాటి ముద్రణ, తరచూ భర్తీ చేసే వ్యయం కూడా తగ్గవచ్చని భావిస్తున్నారు.

2012లోనూ ప్రయోగం


భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీపై గతంలోనూ ప్రయోగాలు జరిగాయి. 2012లో ప్లాస్టిక్ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టే ప్రయత్నం జరిగినప్పటికీ, అప్పట్లో ఎదురైన సాంకేతిక సమస్యల కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ అంశాన్ని మరోసారి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ప్లాస్టిక్ నోట్లను దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచి చలామణిలోకి తీసుకురానున్నారనే దానిపై ఇంకా తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఫీల్డ్ ట్రయల్స్ ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular