
8 మంది నిరుద్యోగులను నమ్మించి డబ్బులు వసూలు..

పాస్‌పోర్టులు తీసుకుని బెదిరింపులు
విజయవాడ, అక్టోబర్ 07 ద్రోణ:– విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఎనిమిది మంది నిరుద్యోగుల నుంచి సుమారు రూ.50 లక్షలు వసూలు చేసి మోసం చేశారంటూ బాధితులు విజయవాడ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. చెన్నైలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్న సమయంలో నరేష్‌కుమార్‌తో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయంతోనే విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని తమను నమ్మించినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం వీసాలు, ఇతర ప్రక్రియల పేరుతో తమ నుంచి విడతలవారీగా భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారని తెలిపారు. అయితే ఆ డబ్బులను తమ ఖాతాల్లో కాకుండా ఇతరుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించినట్లు ఆరోపించారు. డబ్బులు చెల్లించినప్పటికీ విదేశీ ఉద్యోగాలు కల్పించకపోవడంతో బాధితులు నిలదీయగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఉద్యోగాల ప్రక్రియ పేరుతో తమ పాస్‌పోర్టులను తీసుకున్నారని, వాటిని తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపించారు. తమ నుంచి వసూలు చేసిన సుమారు రూ.50 లక్షలను తిరిగి ఇప్పించడంతో పాటు, పాస్‌పోర్టులను అప్పగించి, తమను మోసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టి, డబ్బుల లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, పాస్‌పోర్టుల వ్యవహారం తదితర అంశాలపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.