సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి

ఎస్‌ఐఆర్‌లో తొలగించిన ఓటర్లను పునరుద్ధరించాలి:

సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు

నిజామాబాద్, అక్టోబర్ 07ద్రోణ:- ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేష్‌బాబు డిమాండ్ చేశారు. ఇండియా కూటమి నిర్ణయించిన నిరసన కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌తో పాటు వామపక్ష పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా రమేష్‌బాబు మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో దేశవ్యాప్తంగా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించారని ఆరోపించారు. ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులను పరిగణనలోకి తీసుకోకుండా ఓటర్లను తొలగించే విధానం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ఎన్నికల కమిషన్‌ వ్యవహారశైలి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని ఆయన ఆరోపించారు.

ఎస్‌ఐఆర్‌లో తొలగించిన ఓటర్ల పేర్లను పునరుద్ధరించాలని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడాలని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యావంతులు, మేధావులు ఆందోళనలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయకపోవడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు అండగా నిలుస్తోందని ఆరోపించారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సీఈసీ రాజీనామా చేసే వరకు ప్రజలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు కలిసి పోరాటాలు నిర్వహించాలని రమేష్‌బాబు పిలుపునిచ్చారు.

ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పెద్ది వెంకట్‌రాములు, వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు వేషాల గంగాధర్, సుజాత, విఘ్నేష్, నగర కమిటీ సభ్యులు అనసూయమ్మ, అనిత, రాజు, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular