రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

PACSలు రైతులకు అన్ని రకాల సేవలు అందించే కేంద్రాలుగా ఎదగాలి:

ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

కామారెడ్డి, అక్టోబర్ 7ద్రోణ:-
రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. రైతులకు అవసరమైన సేవలను సకాలంలో అందించడంతో పాటు సహకార సంఘాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహమ్మద్ అలీ షబ్బీర్ నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన PACS చైర్మన్‌గా సుతారి రమేష్ ప్రమాణ స్వీకారం చేయగా, పాలకవర్గ సభ్యులు కూడా బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడితేనే గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

రైతులకు అండగా PACSలు

రైతులకు పంట రుణాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ సేవలు సకాలంలో అందేలా PACSలు సమర్థవంతంగా పనిచేయాలని షబ్బీర్ సూచించారు. సహకార సంఘాలు కేవలం రుణాల పంపిణీకే పరిమితం కాకుండా రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలు అందించే కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, పంట రుణమాఫీ, ఉచిత విద్యుత్, రైతు బీమా, సాగునీటి వనరుల అభివృద్ధి వంటి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడంతో పాటు వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి

బీబీపేట్ PACS నూతన చైర్మన్ సుతారి రమేష్‌ను అభినందించిన షబ్బీర్ అలీ.. రైతులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ఎలాంటి రాజకీయ భేదాలు లేకుండా ప్రతి రైతుకు సమానంగా సేవలందిస్తూ PACSను మరింత బలోపేతం చేయాలని కోరారు.

కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఇల్యాస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, బీబీపేట్ సర్పంచ్ సాత్విక సాయి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, మాజీ DCMS చైర్మన్ ఇంద్రసేన రెడ్డి, సొసైటీ చైర్మన్లు ఇంద్రకరణ్ రెడ్డి, గూడెం శ్రీనివాస్, భీంరెడ్డి, సుధాకర్, అనంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, ఎస్సీ సెల్ అధ్యక్షులు బాలరాజు, మాజీ జడ్పీటీసీ తీర్మాల్ గౌడ్, నరేందర్ రెడ్డి, ఆశబోయిన శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు సందీప్, NSUI నాయకులు భారత్, టీంకు, డేవిడ్, అనిరుద్, భూమాగౌడ్, మధు, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహేష్, ప్రదీప్‌తో పాటు మహిళలు, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular