ప్రొద్దుటూరులో ప్రాసెసింగ్ యూనిట్లపై విజిలెన్స్ దాడులు…

రూ.1.48 కోట్ల విలువైన ధనియాలు స్వాధీనం
ప్రొద్దుటూరు, అక్టోబర్ 08 ద్రోణ:- కడప జిల్లా ప్రొద్దుటూరులో ధనియాల ప్రాసెసింగ్ యూనిట్లలో కల్తీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బుధవారం విజిలెన్స్ అధికారులు మండి బజారులోని ధనియాల ప్రాసెసింగ్ యూనిట్లపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రాసెసింగ్ యూనిట్లో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన ముడి ధనియాలకు రసాయనాలు కలిపి పొడిగా తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం దాడుల్లో భారీగా ధనియాలను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటి విలువ సుమారు రూ.1.48 కోట్లు ఉంటుందని గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబంధించి గాజులపల్లి రమేశ్, వినయ్పై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల నుంచి ముడి ధనియాలను ప్రొద్దుటూరుకు తీసుకొచ్చి, ప్రాసెసింగ్ పేరుతో రసాయనాలు కలిపి పొడిగా మార్చుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న ధనియాలు, వాటిలో కలిపినట్లు చెబుతున్న రసాయనాలపై సంబంధిత అధికారులు తదుపరి పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం.