బతుకమ్మ పండుగకు కోటి మంది మహిళలకు కోటి చీరలు..

సిరిసిల్లలో ఉత్పత్తికి భారీ ఆర్డర్లు
హైదరాబాద్, అక్టోబర్ 8ద్రోణ:- బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేక కానుక అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అక్కాచెల్లెళ్లకు ఈ ఏడాది బతుకమ్మ చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చిలకపచ్చ రంగులో మెరిసే చీరలను మహిళలకు అందించనున్నారు. బతుకమ్మ పండుగకు మరో 15 రోజులు సమయం ఉండగానే చీరల సరఫరా ప్రారంభమైంది. ఇప్పటికే జిల్లాలకు సగం చీరలు చేరుకోగా, మిగిలిన చీరలు కూడా త్వరలోనే చేరనున్నట్లు అధికారులు తెలిపారు. సద్దుల బతుకమ్మకు రెండు రోజుల ముందుగానే మహిళలకు చీరలు పంపిణీ చేసేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
సిరిసిల్లలో చీరల ఆవిష్కరణ
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కలెక్టర్ గరిమా అగర్వాల్ కొత్త బతుకమ్మ చీరలను ఆవిష్కరించారు. చీరల తయారీ కోసం సిరిసిల్లలోని 130 మరమగ్గాల సొసైటీలకు భారీగా ఉత్పత్తి ఆర్డర్లు అందించారు.
చేనేత కార్మికులకు ఆరు నెలలకుపైగా ఉపాధి
కోటి మంది మహిళలకు కోటి చీరలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకోసం సిరిసిల్ల మరమగ్గాల సొసైటీలకు 7 కోట్ల మీటర్ల వస్త్రం, కోటి చీరల ఉత్పత్తికి సంబంధించిన ఆర్డర్లు ఇచ్చారు. ఈ ఆర్డర్లతో చేనేత, మరమగ్గ కార్మికులకు సుమారు ఆరు నుంచి ఏడు నెలల పాటు ఉపాధి లభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చీరల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.