దసరాకు 7 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం టీజీఎస్‌ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు..

25, 26న తిరుగు ప్రయాణ రద్దీకి ప్రత్యేక సర్వీసులు

హైదరాబాద్, అక్టోబర్ 8ద్రోణ:– దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీ జీ ఎస్‌ ఆర్టీ సీ) విస్తృత ఏర్పాట్లు చేసింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా 7 వేల ప్రత్యేక బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించింది. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచనుంది. కరీంనగర్‌ జోన్‌ పరిధిలో మొత్తం 3,533 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఇందులో ఆదిలాబాద్‌ రీజియన్‌లో 431, నిజామాబాద్‌లో 719, కరీంనగర్‌లో 1,175, వరంగల్‌లో 530, ఖమ్మంలో 678 బస్సులను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో 2,155 ప్రత్యేక బస్సులను నడపనున్నారు.

హైదరాబాద్‌ జోన్‌లోని రీజియన్ల వారీగా మహబూబ్‌నగర్‌ 645, మెదక్‌ 255, నల్గొండ 815, రంగారెడ్డి 440 బస్సులను ప్రత్యేకంగా అందుబాటులో ఉంచనున్నారు. అలాగే గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో 1,312 దసరా ప్రత్యేక సర్వీసులను నడపాలని టీజీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది.

9, 10, 16, 17 తేదీల్లో ప్రత్యేక దృష్టి

దసరా పండుగ నేపథ్యంలో ఈ నెల 9, 10, 16, 17 తేదీల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా రోజుల్లో రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను అందుబాటులో ఉంచేలా ప్రణాళిక రూపొందించారు. పండుగ అనంతరం స్వస్థలాల నుంచి హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం ఈ నెల 25, 26 తేదీల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

30 మంది బృందంగా బుక్‌ చేసుకుంటే.. ఇంటివద్దకే బస్సు

ఈసారి విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికుల కోసం టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక సదుపాయాన్ని కల్పించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని కాలనీలు, టౌన్‌షిప్‌లు, హాస్టళ్లు, కళాశాలల నుంచి కనీసం 30 మంది ప్రయాణికులు ఒక బృందంగా ఏర్పడి ముందస్తుగా బస్సు బుక్‌ చేసుకుంటే, వారి వద్దకే బస్సును పంపించి ప్రయాణికులను పికప్‌ చేసే వెసులుబాటును కల్పించింది. ఈ సదుపాయాన్ని వినియోగించుకుని ప్రయాణికులు సురక్షితంగా, సౌకర్యవంతంగా సొంతూళ్లకు చేరుకోవాలని ఆర్టీసీ సూచించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular