కేజీబీవీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

అపరిశుభ్రతపై ఆగ్రహం…..

లోపాలు సరిచేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక

నిజామాబాద్, సిరికొండ08ద్రోణ:- సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు పిచ్చిమొక్కలతో నిండి అపరిశుభ్రంగా ఉండటంపై నిర్వాహకులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల భద్రత విషయంలో నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.

కలెక్టర్ పాఠశాల పరిసరాలతో పాటు వంటగది, స్టోర్‌రూమ్, తరగతి గదులు, మరుగుదొడ్లను పరిశీలించారు. ఆవరణలో పిచ్చిమొక్కలు పెరిగి ఉండటాన్ని గమనించిన ఆమె.. విషకీటకాలు, దోమల బెడదతో విద్యార్థినులకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని నిర్వాహకులను ప్రశ్నించారు. వెంటనే పరిసరాలను పూర్తిగా శుభ్రం చేయడంతో పాటు దోమల వ్యాప్తి నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

హాజరులో తేడాలపై ఆగ్రహం

సిబ్బంది, విద్యార్థినుల హాజరు వివరాలను ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానంలో నమోదు చేస్తున్నారా లేదా అని కలెక్టర్ పరిశీలించారు. పలువురు సిబ్బంది హాజరు నమోదులో తేడాలు ఉన్నట్లు గుర్తించి అసంతృప్తి వ్యక్తం చేశారు. విధులకు సక్రమంగా హాజరుకాకపోతే జీతాలు నిలిపివేస్తామని హెచ్చరించారు.

పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్న

కే జీ బీ వీ లో టాయిలెట్లు, ఫ్లోరింగ్ తదితర మౌలిక వసతుల పనులు ఇంకా ఎందుకు ప్రారంభం కాలేదని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. బాలికల విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్ పనులను వెంటనే ప్రారంభించి నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.

నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి

విద్యార్థినులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. మధ్యాహ్న భోజన మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని సూచించారు. నాసిరకం బియ్యం లేదా ఇతర సరుకులు సరఫరా చేస్తే వెంటనే సంబంధిత మండల అధికారుల దృష్టికి తీసుకురావాలని నిర్వాహకులకు సూచించారు.

ఆర్‌ ఓ ప్లాంట్‌పై ఆదేశాలు

పాఠశాలలోని ఆర్‌ ఓ ప్లాంట్‌ నిరుపయోగంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్.. వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. మరమ్మతులకు అవకాశం లేకపోతే కొత్త ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు.

పాఠశాల ఆవరణతో పాటు విద్యార్థినులు నివసించే పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. వారం, పది రోజుల తర్వాత తాను మళ్లీ పాఠశాలను సందర్శిస్తానని, అప్పటిలోగా గుర్తించిన అన్ని లోటుపాట్లను సరిచేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలను మండల అధికారులు క్రమం తప్పకుండా సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించాలని సూచించారు.

కలెక్టర్ వెంట తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ ఆరీఫ్ అహ్మద్, ఎంఈఓ రమేష్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ షేక్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular