
బతుకమ్మ పాటలు, నృత్యాలతో సందడి చేసిన విద్యార్థినులు
నిజామాబాద్, అక్టోబర్ 09(ద్రోణ):- తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం వైభవంగా జరిగాయి. కళాశాల ప్రిన్సిపల్ గంధం బుద్ధిరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బతుకమ్మ సంబరాలను అంబరాన్నంటేలా జరుపుకున్నారు. పలు రకాల రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థినులు బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. దీంతో కళాశాల ప్రాంగణం పూల పరిమళాలు, జానపద గీతాలతో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ గంధం బుద్ధిరాజు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, మహిళల ఐక్యతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. తొమ్మిది రోజులపాటు నిర్వహించే బతుకమ్మ వేడుకల్లో ప్రతి రోజుకు ప్రత్యేకమైన ఆచారం, ప్రాశస్త్యం ఉన్నాయని వివరించారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ మీదుగా సద్దుల బతుకమ్మతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఈ సంప్రదాయాల వెనుక ఉన్న సాంస్కృతిక ప్రాధాన్యాన్ని యువతరం తెలుసుకోవాలని సూచించారు.

విద్యార్థినులు సాయంత్రం వరకు బతుకమ్మ ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. అనంతరం బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి నిజామాబాద్‌లోని బొడ్డెమ్మ చెరువులో నిమజ్జనం చేశారు. కళాశాలలో నిర్వహించిన ఈ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు అద్దం పట్టాయి.