విశాఖ–భీమిలి మధ్య సముద్ర కోతకు అడ్డుకట్ట..

30 ప్రమాదకర ప్రాంతాల పరిరక్షణకు ప్రణాళిక
విశాఖపట్నం, అక్టోబర్ 10(ద్రోణ):- సముద్రపు అలల ధాటికి తీర ప్రాంతాలలో పెరుగుతున్న భూకోతను నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు సిద్ధమైంది. విశాఖపట్నం నుంచి భీమిలి వరకు సముద్ర కోత ముప్పు ఎదుర్కొంటున్న ప్రాంతాల పరిరక్షణ కోసం రూ.172 కోట్లతో సమగ్ర ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు ద్వారా తీర ప్రాంతాలలో కోతను నియంత్రించి, ప్రమాదకర ప్రాంతాలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టులో భాగంగా విశాఖ–భీమిలి తీర ప్రాంత పరిధిలో సముద్ర కోతకు గురయ్యే 30 ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టనున్నారు. ఇందు కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) ద్వారా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయాలని మంత్రి వర్గ సమావేశంలో ఆదేశించినట్లు పేర్కొన్నారు. డీపీఆర్ రూపకల్పనలో తీర ప్రాంతాల పరిస్థితులు, సముద్రపు అలల ప్రభావం, కోత తీవ్రత తదితర అంశాలను పరిశీలించి తగిన రక్షణ చర్యలను ప్రతిపాదించనున్నారు. నివేదికకు ఆమోదం లభించిన అనంతరం పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు అమలుతో తీర ప్రాంతాల్లో భూకోతను నియంత్రించడంతో పాటు, సముద్రానికి సమీపంలో నివసించే ప్రజలు, తీరప్రాంత మౌలిక సదుపాయాలకు రక్షణ కల్పించేందుకు మార్గం సుగమం కానుంది.