‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ నినాదంతో ఆందోళన….

ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
నిజామాబాద్, అక్టోబర్ 11(ద్రోణ):- దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కుల సంరక్షణే లక్ష్యంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలో మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఆదివారం సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను రద్దు చేయాలని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఇండియా కూటమి ఈ ఆందోళన ద్వారా డిమాండ్ చేయనుంది.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు
చోటుచేసుకుంటున్నాయని, దీనివల్ల అర్హులైన ఓటర్ల హక్కులకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడటంతో పాటు ప్రతి అర్హుడికి ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరుతోంది. ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ నినాదంతో చేపడుతున్న ఈ మహాధర్నాలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇండియా కూటమి నాయకులు పాల్గొననున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, దానిని పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టేందుకు పారదర్శకమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై సమగ్రంగా స్పందించాలని, ఓటు హక్కుకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని భూపతి రెడ్డి అన్నారు. ఈ అంశంపై నైతిక బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం సాగుతున్న పోరాటంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, ప్రజలు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడటంతో పాటు ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను బలోపేతం చేసేందుకు ప్రజాస్వామ్యవాదులంతా తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని కోరారు.