ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రజల ప్రశ్నలు..
ఆరు హామీల అమలుపై నిలదీత
హైదరాబాద్, అక్టోబర్ 11(ద్రోణ):- ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీల్లో ఒకటైన రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ పథకం పై ప్రజలలో చర్చ కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. అర్హులైన ప్రతి కుటుంబానికి పూర్తి స్థాయిలో ప్రయోజనం అందిస్తోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన పేద, మధ్య తరగతి కుటుంబాలకు తక్కువ ధరకు వంట గ్యాస్ అందుతోందా? లేదా? అన్నది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.

నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వంట గ్యాస్ ధర సామాన్య కుటుంబాలకు భారంగా మారుతోంది. ఈ పరిస్థితులలో రూ.500కే సిలిండర్ అందిస్తామన్న హామీ పేద కుటుంబాలలో ఆశలు రేకెత్తించింది. అయితే, ఈ పథకం ప్రయోజనాలు అందని కుటుంబాలు ఉంటే వాటి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
హామీ అమలు పై స్పష్టత ఏదీ?
ఆరు హామీల అమలుపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన వివరాలు అందించాల్సిన అవసరం ఉంది. రూ.500 సిలిండర్ పథకానికి ఎంతమంది అర్హులుగా గుర్తించారు? ఇప్పటివరకు ఎంతమంది ప్రయోజనం పొందారు? అర్హత ఉన్నప్పటికీ పథకం వర్తించని కుటుంబాలు ఎన్ని? సబ్సిడీ చెల్లింపుల్లో ఏమైనా జాప్యం జరుగుతోందా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెల్లడించాలి.

సామాన్యులకు భరోసా కల్పించాలి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలంటే వాటి అమలులో పారదర్శకత అవసరం. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవడంతోపాటు, సమస్యలు ఎదుర్కొంటున్న వారికి సత్వర పరిష్కారం చూపాలి. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్న హామీ అమలు తీరుపై ప్రజలకు స్పష్టత ఇచ్చి, అర్హులందరికీ ప్రయోజనం అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ప్రజల ప్రశ్న ఒక్కటే.. ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.500 గ్యాస్ సిలిండర్ హామీ అర్హులైన ప్రతి కుటుంబానికి పూర్తి స్థాయిలో అందుతోందా? అందకపోతే ఎందుకు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.