తెలంగాణ భాషా మాధుర్యాన్ని చాటే కథలకు అంతర్జాతీయ వేదిక

హరిదా ఉత్తమ తెలంగాణ కథా పురస్కారాల….

గోడపత్రం ఆవిష్కరించిన కల్వకుంట్ల కవిత

తొలి ఉత్తమ కథకు రూ.10 వేల నగదు బహుమతి..

అక్టోబరు 30లోగా కథలు పంపాలి

హైదరాబాద్, అక్టోబరు 11(ద్రోణ):- తెలంగాణ భాష జీవ భాష అని, ఆ భాషలో సృజించిన సాహిత్యం పండితులను, సామాన్యులను సమానంగా అలరిస్తుందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ భాషలోని మాధుర్యం, నుడి కారం, సాంస్కృతిక వైభవాన్ని భవిష్యత్తు తరాలకు అందించేందుకు హరిదా రచయితల సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ‘సరస్వతీరాజ్‌–హరిదా అంతర్జాతీయ ఉత్తమ తెలంగాణ కథా పురస్కారం–2026’ పోటీలకు సంబంధించిన గోడ పత్రాన్ని కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ భాషలోని సొగసు, పదబంధాలు, నుడి కారాలు, సామెతలను కథల రూపంలో భవిష్యత్తు తరాలకు అందించడం మంచి ప్రయత్నమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ భాషలో కథల పోటీ నిర్వహించడం ఆదర్శనీయమని, తెలంగాణ యాసలో కథలు రాయ గల రచయితలకు ఇది గొప్ప అవకాశమని చెప్పారు. ఆసక్తి ఉన్న రచయి తలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కథల ద్వారానే భాష గొప్పతనం

ప్రముఖ నటి అనన్య నాగళ్ల మాట్లాడుతూ ఏ భాష గొప్పతనమైనా ఆ భాషలోని కథల ద్వారానే తెలుస్తుందని అన్నారు. కథలు ఒక ప్రాంతపు భాష, సంస్కృతి, జీవన విధానాన్ని భవిష్యత్తు తరాలకు అందించే శక్తి వంతమైన సాధనాలని పేర్కొన్నారు. హరిదా రచయి తల సంఘం నిర్వహిస్తున్న కథల పోటీలు రచయితల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు దోహదపడతాయని, రచయి తలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

తెలంగాణతనం ప్రతిబింబించేలా కథలు

హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ మాట్లాడుతూ తెలంగాణ భాష, సంస్కృతుల వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంతో పాటు భావితరాలకు అందించాలనే లక్ష్యంతో అంతర్జాతీయ స్థాయి కథల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ భాషలో కథలు రాసే రచయితలు ఈ పోటీలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ఆత్మ, ప్రజల జీవితం, సంస్కృతి, భాష, జీవన విధానాన్ని ప్రతిబింబించే అంశాలతో కథలు రాయాలని సూచించారు. కథలో తెలంగాణతనం స్పష్టంగా కనిపించాలని, గతంలో ఎక్కడా ప్రచురితం కాని, సామాజిక మాధ్యమాలలో ఉంచని, ఇతర పోటీలకు పంపని కొత్త కథలనే పంపాలని తెలిపారు. కథలు అనువాదం, అనుకరణ లేదా అనుసరణ అయి ఉండ కూడదని స్పష్టం చేశారు.

రచయితలు అక్షరదోషాలు లేకుండా యూనికోడ్‌ విధానంలో 14 పరిమాణం గల అక్షరాలతో, ఏ4 కాగితంపై కథను ముద్రించాలి. కథ గరిష్ఠంగా ఎనిమిది పేజీలకు మించకూడదు. కథ పేజీల పై రచయిత పేరు రాయకూడదు. పోటీ నిబంధనలను అంగీకరిస్తూ ప్రత్యేకంగా జత చేసే హామీ పత్రంలో మాత్రమే పేరు, చిరునామా, ఫోన్‌ నంబరు, ఈ-తపాలా చిరునామా వివరాలను పొందుపరచాలి. విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయమని నిర్వాహకులు వెల్లడించారు.

తొలి బహుమతి రూ.10 వేలు

పోటీలలో ఎంపికయ్యే మొదటి ఉత్తమ కథకు రూ.10,000 నగదు బహుమతి అందజేయనున్నారు. తర్వాత తొమ్మిది ఉత్తమ కథలకు ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున నగదు పురస్కారంతో పాటు సముచిత సత్కారం చేయనున్నారు. డిసెంబరు 4న నిజామాబాద్‌లోని నవ్య భారతి అంతర్జాతీయ పాఠశాలలో నిర్వహించే హరిదా రచయితల సంఘం మహా సభలో పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.

అర్హత, ఆసక్తి ఉన్న రచయితలు తమ కథతో పాటు హామీ పత్రాన్ని అక్టోబరు 30వ తేదీలోగా haridaasaraswathiraj@gmail.com అనే ఈ-తపాలా చిరునామాకు పంపాలి. ఇతర వివరాలకు 9030033331 నంబరును సంప్రదించవచ్చు. కార్యక్రమంలో టీ ఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రంగు నవీనాచారి, నాయకులు రూప్‌సింగ్‌, శరత్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular