ఢిల్లీలో యువతపై పోలీసుల దాడులకు నిరసనగా
నిజామాబాద్‌లో సీపీఐ ఆందోళన
నిజామాబాద్, అక్టోబర్ 11(ద్రోణ):- ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువత, వివిధ రాజకీయ పార్టీల నాయకుల పై పోలీసుల దాడులను నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. అరెస్టు చేసిన నిరసనకారులను బేషరతుగా విడుదల చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)ను రద్దు చేయాలని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తున్న నాయకులు, యువత పై దాడులు చేసి అరెస్టు చేయడం దురదృష్టకరమని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును అణచివేయడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. ప్రతి పౌరుడికి ఓటు హక్కును పరిరక్షించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలని సుధాకర్ అన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఓటరు జాబితా నుంచి పేర్లను తొలగించడం రాజ్యాంగ బద్ధమైన హక్కులకు విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో శాంతి యుతంగా జరుగుతున్న నిరసనలపై పోలీసుల చర్యలు ప్రశ్నించే గొంతుకను నొక్కే ప్రయత్నంగా ఉన్నాయని విమర్శించారు. అరెస్టు చేసిన వారందరినీ ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ఆందోళనలో సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు వై. ఓమయ్య, జిల్లా నాయకులు వై. రాజిరెడ్డి, రఘురాం, రంజిత్, అలీ ఇమ్రాన్, కుశాల్ తదితరులు పాల్గొన్నారు.