ఢిల్లీలో నిరసనకారుల అరెస్టులపై ఆగ్రహం.

నిజామాబాద్‌లో సీపీఐ నిరసన..

కేంద్ర ప్రభుత్వ తీరుపై జిల్లా కార్యదర్శి పి. సుధాకర్ ఆగ్రహం

నిజామాబాద్, అక్టోబర్ 11(ద్రోణ):- ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువత, వివిధ రాజకీయ పార్టీల నాయకులపై పోలీసులు దాడులు చేసి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అరెస్టు చేసిన వారిని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)ను రద్దు చేయాలని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న నాయకులు, యువతపై పోలీసులు దాడులు చేసి అరెస్టు చేయడం సరికాదన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించి, ఆ హక్కును పరిరక్షించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాల్సి ఉందని సుధాకర్ అన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఓటు హక్కును తొలగించే చర్యలు రాజ్యాంగం కల్పించిన హక్కులకు విఘాతం కలిగిస్తాయని విమర్శించారు. ఎన్నికల సంఘం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఢిల్లీలో శాంతియుతంగా జరుగుతున్న నిరసనలపై పోలీసుల చర్యలు ప్రశ్నించే గొంతుకలను అణచివేసే ప్రయత్నంగా కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. అరెస్టు చేసిన నిరసనకారులను బేషరతుగా విడుదల చేయాలని, ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు వై. ఓమయ్య, జిల్లా నాయకులు వై. రాజిరెడ్డి, రఘురాం, రంజిత్, అలీ ఇమ్రాన్, కుశాల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular