పర్యాటక కేంద్రంగా కొత్త రూపు!
విశాఖ తీరంలో పర్యాటకులకు

కనువిందు చేయనున్న ‘ఎంవీ మా’ నౌక
దసరా నుంచి సందర్శనకు అనుమతించే అవకాశం
విశాఖపట్నం, అక్టోబర్ 12(ద్రోణ):- ఆరేళ్ల క్రితం తుపాను ధాటికి సముద్రం నుంచి కొట్టుకొచ్చి విశాఖపట్నంలోని తెన్నేటి పార్కు తీరానికి చేరిన బంగ్లాదేశ్‌కు చెందిన ‘ఎంవీ మా’ నౌక త్వరలో పర్యాటకులను ఆకర్షించనుంది. ఇన్నాళ్లూ తీరంలోనే నిలిచిపోయిన ఈ నౌకను సందర్శన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
తుపాను కారణంగా తీరానికి చేరిన ఈ నౌకను పర్యాటక ఆకర్షణగా మార్చాలన్న ప్రతిపాదనకు తీరప్రాంత నియంత్రణ నిబంధనలు, అవసరమైన అనుమతుల జాప్యం అడ్డంకిగా మారాయి. దీంతో ప్రాజెక్టు ముందుకు సాగడంలో ఆలస్యం జరిగింది. తాజాగా కొన్ని షరతులతో నౌకను సందర్శన కేంద్రంగా మార్చేందుకు మార్గం సుగమమవుతున్నట్లు తెలుస్తోంది.
అన్నీ అనుకున్నట్లు జరిగితే దసరా నుంచి సందర్శకులకు నౌకను చూసే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. సముద్ర తీరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ నౌక పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించనుంది. ప్రాజెక్టు అమల్లోకి వస్తే విశాఖ తీరానికి వచ్చే సందర్శకులకు మరో పర్యాటక ఆకర్షణ అందుబాటులోకి వచ్చినట్లవుతుంది.