Thursday, October 15, 2026

నేరాల కట్టడికి కఠిన చర్యలు

బోధన్‌ డివిజన్‌ పోలీసులకు

కమిషనర్‌ పి. సాయి చైతన్య ఆదేశాలు

డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై ప్రత్యేక నిఘా..

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 14 (ద్రోణ): బోధన్‌ డివిజన్‌ పరిధిలో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ పి. సాయి చైతన్య ఐ,పీ,ఎస్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని స్పష్టం చేశారు. వర్ని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చింతకుంట వృద్ధాశ్రమంలో బుధవారం బోధన్‌ డివిజన్‌ పోలీస్‌ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

డ్రగ్స్‌, గంజాయి అక్రమ రవాణా నిర్మూలనకు ప్రత్యేక దాడులు కొనసాగించాలని, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ సూచించారు. అవసరమైన సందర్భాల్లో పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని ఆదేశించారు. హత్యలు, హత్యాయత్నాలు, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్‌ మోసాలు, పేకాట, గుట్కా అక్రమ వ్యాపారం తదితర కేసుల పురోగతిని సమీక్షించారు. రౌడీ షీటర్లు, పాత నేరస్థులు, బెయిల్‌ పై విడుదలైన నిందితుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, రాత్రి గస్తీని బలోపేతం చేయాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలలో నిర్లక్ష్యం వహించరాదన్నారు. దేవి నవరాత్రులు, రానున్న పండుగల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, వాహనాల తనిఖీలను నిరంతరం కొనసాగించాలని ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ

ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని కమిషనర్‌ సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను బ్లాక్‌ స్పాట్లుగా గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులకు అనుసంధానమైన లింకు రోడ్ల వద్ద ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని, రోడ్డుకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రహదారుల నిర్మాణ లోపాలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, అతివేగం, ట్రిపుల్‌ రైడింగ్‌, మైనర్లు వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

సైబర్‌ నేరాలపై అప్రమత్తత

ఆన్‌లైన్‌ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు బాధితుల ఫిర్యాదుల పై తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టుల పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ షీ టీమ్స్‌, ఈగల్‌ టీమ్స్‌, చీతా ఫోర్స్‌ బృందాలు సమర్థవంతంగా పనిచేయాలని, విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాలలో నిఘా పెంచాలని తెలిపారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని, ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. సీసీ కెమెరాల వినియోగాన్ని విస్తరించి సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసర సమయంలో పోలీసుల సహాయం పొందేందుకు డయల్‌ 112పై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యాన్ని సహించబోమని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని కమిషనర్‌ స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో బోధన్‌ ఏ సీ పీ శ్రీనివాస్‌, సీ సీ ఆర్‌ బీ ఏ సీ పీ గురునాయుడు, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌. అంజయ్య, సీఐలు, ఎస్‌ హెచ్‌వోలు, ఎస్‌ఐలు, ఐటీ కోర్‌ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular