చింతకుంట వృద్ధాశ్రమంలో 25 మందికి దుస్తుల పంపిణీ…

స్వయంగా భోజనం వడ్డించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్, అక్టోబర్ 14 (ద్రోణ): పోలీస్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా సామాజిక సేవలోనూ ముందుంటుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అన్నారు. వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతకుంట గ్రామంలో ఉన్న ఉచిత వృద్ధాశ్రమాన్ని బుధవారం సందర్శించిన ఆయన, అక్కడ నివసిస్తున్న వృద్ధుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 25 మంది వృద్ధులకు దుస్తులు పంపిణీ చేసి, స్వయంగా భోజనం వడ్డించారు.

వృద్ధులు కుటుంబాలకు, సమాజానికి విలువైన సంపద అని కమిషనర్ పేర్కొన్నారు. వారి అనుభవాలు భావితరాలకు మార్గదర్శకమని, వయస్సు పైబడిన తల్లిదండ్రులు, వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరూ ప్రేమాభిమానాలు, గౌరవం చూపాలని సూచించారు. వృద్ధాప్యంలో ఆప్యాయత, ఆదరణ, సంరక్షణ అందించడం కుటుంబ సభ్యులతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.

వృద్ధాశ్రమాలలో ఉంటున్న వారు ఒంటరితనానికి గురికాకుండా, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్నవారికి, నిరుపేదలకు, వృద్ధులకు అండగా నిలవడం ద్వారా పోలీసులపై ప్రజలకు నమ్మకం, భరోసా మరింత పెరుగుతాయని తెలిపారు.

చింతకుంట మోహన్ ఎంతో శ్రద్ధతో వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తూ మానవతా సేవలు అందించడం అభినందనీయమని కమిషనర్ కొనియాడారు. ఆశ్రమానికి భవిష్యత్తులో అవసరమైన సహాయ సహకారాలు కావాలంటే తెలియజేయాలని మోహన్కు భరోసా ఇచ్చారు. అనంతరం ఆశ్రమంలోని ఫొటో ప్రదర్శనను తిలకించి, ఆవరణలో మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, రుద్రూర్ సీఐ కృష్ణ, బోధన్ ఎస్హెచ్ఓ వెంకట్ నారాయణ, వర్ని ఎస్ఐ వంశీకృష్ణ, వృద్ధాశ్రమ వ్యవస్థాపకుడు చింతకుంట మోహన్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
