అర్హతలపై వీడని సందిగ్ధత
హైదరాబాద్, అక్టోబర్ 15(ద్రోణ):– మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన తొలి దశ భూసేకరణ ప్రక్రియ వేగ వంతమైంది. రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని రెండు గ్రామాలలో భూముల విలువ, విస్తీర్ణం, హక్కుదారుల నిర్ధారణ ప్రక్రియ తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. మరో మూడు గ్రామాలలో భూసేకరణకు సంబంధించి వచ్చిన అభ్యంతరాల పరిశీలన కొనసాగుతోంది. భూసేకరణలో భాగంగా భూముల వివరాలు, హక్కుదారుల గుర్తింపు, పరిహారం చెల్లింపుల అంశాలపై అధికారులు దృష్టి సారించారు. ప్రభావిత భూయజమానులతో పరిహారానికి సంబంధించి చర్చలు జరుపుతున్నారు. అయితే భూమి పత్రాలు లేని వారు, అద్దెదారులు, వ్యాపారులు, అక్కడ పనిచేసే ఉద్యోగులకు ఎలాంటి సాయం అందిస్తారనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పరిధిలో భూసేకరణకు సంబంధించి ఫిబ్రవరి 11, 2026ను ఎంఆర్డీసీఎల్ కటాఫ్ తేదీగా ప్రకటించింది. ఈ తేదీ ఆధారంగా అర్హతలను ఎలా నిర్ణయిస్తారు? పత్రాలు లేని బాధితులకు పరిహారం లేదా పునరావాస సాయం అందుతుందా? అద్దెదారులు, చిరు వ్యాపారులు, ఉద్యోగుల ప్రయోజనాలను ఏ విధంగా పరిరక్షిస్తారు? అనే ప్రశ్నలు స్థానికంగా చర్చ నీయాంశమయ్యాయి. భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుతున్న నేపథ్యంలో బాధితులకు పరిహారం, పునరావాసం పై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని పలువురు కోరుతున్నారు. భూములు కోల్పోయే వారితో పాటు జీవనోపాధి పై ప్రభావం పడే ఇతర వర్గాలకు కూడా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
