ప్రాణాలకు తెగించి కాపాడిన ముగ్గురు పౌరులు..
అభినందించి సత్కరించిన ప్రముఖులు
హైదరాబాద్, అక్టోబర్ 15(ద్రోణ):- హుస్సేన్ సాగర్లోకి కన్నతల్లే ఆరేళ్ల చిన్నారిని నెట్టి వేసిన ఘటనలో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పందించి బాలిక ప్రాణాలను కాపాడిన ముగ్గురు పౌరులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆటో డ్రైవర్ ఫక్రుద్దీన్, ప్రైవేట్ ఉద్యోగి బాలకృష్ణ, వ్యాపారి మహ్మద్ అఫ్సర్ ప్రాణాలకు తెగించి చిన్నారిని రక్షించడంతో ఓ నిండు ప్రాణం నిలిచింది.

ఆపదలో ఉన్న వారిని చూసి వీడియోలు తీస్తూ ఉండిపోయే పరిస్థితులు కనిపిస్తున్న ప్రస్తుత రోజుల్లో, ఈ ముగ్గురు చూపిన ధైర్య సాహసాలు, సమయస్ఫూర్తి మానవత్వానికి నిదర్శనంగా నిలిచాయని వారిని అభినందించి సత్కరించిన ప్రముఖులు పేర్కొన్నారు. ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ముందుకొచ్చిన వారి సాహసం సమాజానికి ఆదర్శమని కొనియాడారు. పిల్లల అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యలు తల్లిదండ్రులకు తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగించినప్పటికీ, పిల్లల ప్రాణాలను తీసే నిర్ణయాలు పరిష్కారం కావని సూచించారు. ఎంతటి కష్టాలు ఎదురైనా అధైర్యపడ కుండా, నిరాశకు లోను కాకుండా కుటుంబ సభ్యులు, సమాజం నుంచి సహాయం కోరాలని పిలుపునిచ్చారు. ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు. కష్టకాలంలో అండగా నిలిచేందుకు సమాజం ముందుకొస్తుందని, సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోవాలని పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తుచేశారు.
