రానున్న 10 నెలల పాటు తాగునీటికి
ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి:
ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి
నిజామాబాద్, అక్టోబర్ 17(ద్రోణ):- ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పి. సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్న నేపథ్యంలో తాగునీటి వనరుల పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రధాన తాగునీటి వనరులైన నిజాంసాగర్, శ్రీరాంసాగర్ జలాశయాల్లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వల వివరాలను సమీక్షించారు. రానున్న పది నెలల పాటు నిజామాబాద్ నగరంతో పాటు జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

రబీలో తక్కువ నీటితో పండే పంటల సాగుకు ప్రాధాన్యం
తీవ్ర వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రబీ సీజన్‌లో వరి సాగుకు దూరంగా ఉండాలని సుదర్శన్‌రెడ్డి రైతులకు సూచించారు. నీటి నిల్వలు తగ్గితే విద్యుత్ ఉత్పత్తితో పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరాపైనా ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. అందువల్ల నీటి వినియోగం తక్కువగా ఉండే కూరగాయలు, పప్పుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు.

ఈ సమీక్షలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నూడా చైర్మన్ కేశ వేణుతో పాటు మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, ఆర్‌డబ్ల్యూఎస్, భూగర్భ జలాలు, వ్యవసాయం, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.