పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై చర్చ
తొలుత అఖిలపక్ష భేటీ నిర్వహించాలి..

ప్రధాని మోదీకి ఖర్గే లేఖ
న్యూఢిల్లీ, అక్టోబర్ 18(ద్రోణ):-
నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి రాజకీయంగా తెరపైకి వచ్చింది. ఈ నెలాఖరులోగా సంబంధిత రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బిల్లుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ సాధించేందుకు డీఎంకేతో పాటు ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. లోక్ సభతో పాటు రాష్ట్రాల శాసనసభల్లో సభ్యుల సంఖ్యను 50 శాతం వరకు పెంచి, మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు అమలు చేయడం ఈ ప్రతి పాదనలో ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటున్నారు. 2023లోనే మహిళా రిజర్వేషన్ చట్టం ఆమోదం పొందినప్పటికీ, దాని అమలును నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడంపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దక్షిణాది రాష్ట్రాల ఆందోళన
2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే ఉత్తరాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాతి నిధ్యం పెరిగి, దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గే ప్రమాదం ఉందని ఆయా ప్రాంతాల పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకేతో పాటు ఇతర పార్టీల అభ్యంతరాలను పరిష్కరించి, బిల్లుకు మద్దతు కూడ గట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అవసరమైన మెజారిటీ పై స్పష్టత వచ్చిన తర్వాతే ప్రత్యేక సమావేశాల ద్వారా బిల్లును ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అఖిల పక్ష భేటీకి ఖర్గే డిమాండ్
మరో వైపు, నియోజకవర్గాల పునర్విభజన పై కొత్త ప్రతి పాదనలుంటే ముందుగా రాజకీయ పార్టీలతో చర్చించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి శుక్రవారం లేఖ రాశారు. కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు పరిశీలనకు పంపే ముందే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు.
ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఏప్రిల్ 11న, అనంతరం జూలై 16, ఆగస్టు 27 తేదీలలో నూ ప్రధానికి లేఖలు రాసినట్లు ఖర్గే గుర్తుచేశారు. అయినప్పటికీ సమావేశం నిర్వహించలేదని విమర్శించారు. ప్రతి పక్షాలను పక్కనపెట్టి బిల్లును ఆమోదింపజేసుకునే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. అన్ని పార్టీలకు ప్రతిపాదనలను పరిశీలించి, తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు తగిన సమయం ఇవ్వాలని పేర్కొన్నారు.
పార్లమెంటు ప్రొరోగ్ పై ప్రశ్నలు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసి రెండు నెలలు దాటినా ఉభయ సభలను ఇంత వరకు ప్రొరోగ్ చేయకపోవడం పై ఖర్గే ప్రశ్నలు లేవనెత్తారు. పునర్విభజన బిల్లును దృష్టిలో ఉంచుకునే ఈ ప్రక్రియను నిలిపివేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత పార్లమెంటు ఉభయ సభలను ప్రొరోగ్ చేసి, అనంతరం బిల్లుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఆయన కోరారు.
నియోజక వర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతి నిధ్యం వంటి అంశాలు ఈ ప్రతిపాదనతో ముడిపడి ఉండటంతో, కేంద్రం తదుపరి అడుగులు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
