Sunday, October 18, 2026

దుర్గాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే భూపతి రెడ్డి..

నీటి పొదుపుపై పిలుపు

నిజామాబాద్, అక్టోబర్ 18(ద్రోణ):- దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి కుటుంబ సమేతంగా మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలోని డివిజన్ నంబర్ 1, కాలూర్–ఖానాపూర్‌లో కొలువుదీరిన అమ్మవారికి ఆదివారం ఆయన పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ అగ్గు భోజన్నతో పాటు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతులు పండించే పంటలు సమృద్ధిగా పండాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదని అమ్మవారిని కోరుకున్నట్లు పేర్కొన్నారు.

నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి

ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. తాగునీరు, సాగునీటి విషయంలో ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ నీటి వృథాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

రబీలో ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి

రాబోయే రబీ సీజన్‌లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని భూపతి రెడ్డి సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా సాగు ఖర్చులు, నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు.

మహాలక్ష్మి అమ్మవారి కృపతో ఎల్ నినో ముప్పు తొలగిపోయి, పంటలు సమృద్ధిగా పండి రైతులు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular