భూ సర్వేకు ఆదేశం
నిజామాబాద్ రూరల్, అక్టోబర్ 18(ద్రోణ):- రైల్వే ట్రాక్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న నల్లవెల్లి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అధికారులను ఆదేశించారు. భూముల విస్తీర్ణం పై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు మరోసారి రీ సర్వే నిర్వహించాలని సూచించారు.

ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ నిర్మాణం జరుగుతున్న నే పథ్యంలో భూములు కోల్పోతున్న పలువురు రైతులు ఆదివారం ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను వివరించారు. రైల్వే ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతుల వివరాలను సంబంధిత అధికారులు ప్రచురించిన పత్రికా ప్రకటనలో తప్పుగా నమోదు చేశారని వారు ఆరోపించారు. వాస్తవంగా తమకు ఎక్కువ భూమి ఉన్నప్పటికీ తక్కువ విస్తీర్ణాన్ని నమోదు చేయడం వల్ల నష్టపరిహారం తగ్గి పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో న్యాయం చేసి, తమకు తగిన పరిహారం అందేలా చూడాలని ఎమ్మెల్యేను కోరారు.

రైతుల విజ్ఞప్తి పై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే ఆర్డీ ఓ తో ఫోన్ లో మాట్లాడారు. భూములు కోల్పోతున్న రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి రీ సర్వే నిర్వహించాలని సూచించారు. భూముల వాస్తవ విస్తీర్ణాన్ని నిర్ధారించి, అర్హులైన నిర్వాసిత రైతులకు న్యాయబద్ధంగా, తగిన నష్టపరిహారం అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
