Monday, October 19, 2026

విక్టోరియా ఆసుపత్రిలో ఆధ్యాత్మిక శోభ..

ఘనంగా మెడికల్ సండే

మిషనరీల సేవలను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు..

ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయం

డిచ్‌పల్లి, అక్టోబర్ 18(ద్రోణ):- డిచ్‌పల్లిలోని చారిత్రక విక్టోరియా హాస్పిటల్‌లో ఆదివారం మెడికల్ సండే వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు, దైవ సందేశ కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని చిలకలగూడ పాస్టరేట్‌కు చెందిన డాక్టర్ ప్రసన్నకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని దేవుని వాక్యాన్ని బోధించారు.

సేవా స్ఫూర్తిని చాటిన మిషనరీలు

దశాబ్దాల చరిత్ర కలిగిన విక్టోరియా హాస్పిటల్ అభివృద్ధిలో మిషనరీలు అందించిన సేవలను ఈ సందర్భంగా వక్తలు గుర్తుచేసుకున్నారు. 1950 నుంచి ఆసుపత్రి ప్రస్థానంలో చోటుచేసుకున్న కీలక పరిణామాలను ప్రస్తావిస్తూ, ప్రజలకు వైద్య సేవలు అందించడంలో మిషనరీలు చూపిన అంకితభావాన్ని కొనియాడారు. నిస్వార్థ సేవ, మానవతా దృక్పథం, ఆధ్యాత్మిక విలువలతో వారు సాగించిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ప్రార్థనలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు

రెవరెండ్ ఎసుకుమార్, సెక్రటరీ సాంసన్, ప్రాపర్టీ ఇన్‌చార్జ్ సురానా, ట్రెజరర్ ప్రశాంత్ రాజ్, స్టీవార్డ్ ప్రసాద్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ప్రార్థనలు, ఆధ్యాత్మిక సందేశాల మధ్య వేడుకలు కొనసాగాయి.

వైద్య సేవల విస్తరణకు కృషి

విక్టోరియా హాస్పిటల్ చారిత్రక ప్రస్థానాన్ని కొనసాగిస్తూ, భవిష్యత్తులో ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. వైద్య రంగంలో సేవా దృక్పథాన్ని మరింత బలోపేతం చేస్తూ, అవసరమైన వారికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక విశ్వాసం, మానవ సేవ అనే ఆశయాలతో నిర్వహించిన మెడికల్ సండే వేడుకల్లో ఆసుపత్రి సిబ్బంది, సంఘ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular