ప్రజలకు పోలీస్ కమిషనర్ పండుగ శుభాకాంక్షలు
నిజామాబాద్, అక్టోబర్ 19(ద్రోణ):- విజయదశమి పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆకాంక్షించారు. అక్టోబర్ 20న నిర్వహించనున్న విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ ప్రజలందరికీ ఆయనతో పాటు పోలీస్ శాఖ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

దుష్టశక్తులపై సత్యం, ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటారని పేర్కొన్నారు. ఈ పండుగ స్ఫూర్తితో ప్రజలందరూ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ పరస్పర సోదరభావంతో మెలగాలని, ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పోలీస్ డివిజన్ల పరిధిలో ప్రజలందరూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు. మతపరమైన విద్వేషాలకు తావివ్వకుండా, ఇతరుల మనోభావాలను గౌరవిస్తూ పండుగను స్నేహపూర్వక వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.
ప్రజలు, పోలీస్ సిబ్బంది పరస్పర విశ్వాసం, స్నేహభావం, సోదరభావంతో మెలగాలని పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. పండుగ సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
