
క్షేత్రస్థాయిలో పోలీసుల నిఘా
బోధన్ టౌన్, ప్రతినిధి అక్టోబర్ 29 (ద్రోణ):- మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పోలీస్ కమిషనర్ (సీపీ) ఆదేశాల మేరకు బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ‘పోలీస్ అక్క’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. మహిళా పోలీసు సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ మహిళలు, యువతులకు భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు.

విధులల్లో భాగంగా మహిళా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు డయల్ 112కు వచ్చే అత్యవసర ఫిర్యాదులపై స్పందిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లను సందర్శించి మహిళలు, విద్యార్థినులతో మాట్లాడుతున్నారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండటం, సమస్యలు ఎదురై నప్పుడు పోలీసులను సంప్రదించడం, అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేసి సహాయం పొందడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.

మహిళలు నిర్భయంగా తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావడం, వారికి భద్రతపై నమ్మకం కల్పించడం, ఆపద సమయాల్లో సత్వర పోలీసు సహాయం అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. మహిళల భద్రతకు సంబంధించి ప్రజలల్లో అవగాహన పెంపొందించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపడుతోంది.
— బోధన్ ఎస్‌హెచ్‌ఓ
