బమ్మెరలో గ్రాడ్యుయేట్లను కలిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి కొమురెల్లి యాదవ్

బమ్మెర, ప్రతినిధి నవంబర్ 1 ( ద్రోణ):- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలల్లో అర్హులైన పట్టభద్రులందరూ ఓటు హక్కు పొందేలా బీ ఆర్ ఎస్ నాయకులు గ్రామస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి జిట్ట బోయిన కొమురెల్లి యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టభద్రులను కలిసి ఓటరు నమోదు పై అవగాహన కల్పించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కొమురెల్లి యాదవ్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు విద్యా వంతులకు తమ సమస్యలను వినిపించేందుకు కీలక వేదికగా నిలుస్తాయని అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు.
రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీల పంపిణీ వంటి హామీలు ఇచ్చారని, వాటి అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో జాప్యం వల్ల విద్యార్థులు, కళాశాలలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరారు. అలాగే రైతులకు సాగునీరు, విద్యుత్ సరఫరా, రైతుబంధు, రుణమాఫీ, ప్రజా సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం జవాబు దారీగా వ్యవహరించాలని అన్నారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకకు ఎమ్మెల్సీ ఎన్నికలు బలాన్నిస్తాయని పేర్కొన్న ఆయన, పట్టభద్రులు ఓటరు నమోదును నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. పార్టీ నాయకులు, కార్య కర్తలు ప్రతి గ్రామంలో అర్హులైన పట్ట భద్రులను గుర్తించి, నిర్ణీత గడువులోగా ఓటరు నమోదుకు అవసరమైన అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బమ్మెర గ్రామపంచాయతీ నాలుగో వార్డు సభ్యుడు జోగు ఆంజనేయులు, గ్రామ సీనియర్ యువజన నాయకుడు జున్ను సంపత్, బీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వంగాల గణేష్, యువజన నాయకులు తోకల శోభన్, బత్తిని రాజు తదితరులు పాల్గొన్నారు.