ఊరంతా పండుగ సంబరం..

ఖాకీకి మాత్రం విధుల భారం….

విధి నిర్వహణలో ఖాకీ….

ఇంటి వద్ద కుటుంబం చూపులు….

ప్రజల రక్షణే ధ్యేయం…

కుటుంబానికి దూరమే ప్రాప్తం…..

ఖాకీ కళ్లలలో బాధ్యత…..

కుటుంబం గుండెలల్లో ఆందోళన….

పదిమందికి రక్షణగా..

తన కుటుంబానికి దూరంగా….

ప్రత్యేక కథనం

నిజామాబాద్, ప్రతినిధి నవంబర్ 02 (ద్రోణ):- సమాజంలో ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో సంతోషంగా గడపాలని కోరుకుంటారు. పండుగలు, పర్వదినాలు, కుటుంబ వేడుకలు వచ్చినప్పుడు ఆ ఆనందం మరింత రెట్టింపు ఉంటుంది. కానీ ప్రజలందరూ ప్రశాంతంగా వేడుకలు జరుపుకునేందుకు కొందరు మాత్రం తమ వ్యక్తి గత ఆనందాలను పక్కన పెట్టి విధి నిర్వహణలో నిమగ్నమవుతారు. వారే పోలీసులు. ప్రజల భద్రత కోసం రాత్రింబ వళ్లు కాపలా కాసే ఖాకీ దుస్తుల వెనుక ఎన్నో త్యాగాలు, కుటుంబాలకు దూరంగా గడిపే క్షణాలు, బయటకు కనిపించని భావోద్వేగాలు దాగి ఉంటాయి.

పండుగ వెలుగుల్లోనూ విధుల బాటలోనే..

పట్టణాలు, పల్లెలు పండుగ శోభతో కళకళలాడుతున్న వేళ పోలీసులు మాత్రం బందోబస్తు విధులల్లో నిమగ్నమై ఉంటారు. ప్రధాన కూడలి, రద్దీ ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలు, మార్కెట్లు, రహదారులపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా చర్యలు తీసుకుంటారు. ట్రాఫిక్ నియంత్రణ నుంచి శాంతి భద్రతల పరి రక్షణ వరకు ప్రతి బాధ్యతను అప్రమత్తంగా నిర్వహిస్తారు.

ఇతరుల ఇళ్లలలో ఆనందాల సందడి కనిపిస్తుంటే.. పోలీసుల ఇళ్లలో మాత్రం వారి రాక కోసం ఎదురు చూపులు ఉంటాయి. పండుగ రోజైనా కుటుంబంతో గడపాలని, పిల్లలతో సరదాగా సమయం వెచ్చించాలని ఆశపడినా.. విధుల ప్రాధాన్యత దృష్ట్యా ఆ కోరికలను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.

పిల్లల ఆశలు..

తల్లిదండ్రుల ఎదురుచూపులు

“నాన్న ఎప్పుడు వస్తారు?” అనే చిన్నారుల ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితులు పోలీసు కుటుంబాలల్లో సాధారణంగా ఎదురవుతుంటాయి. పాఠశాలలో పిల్లలకు సెలవులు వచ్చినా, ఇంట్లో పండుగ వాతావరణం నెలకొన్నా.. విధులల్లో ఉన్న తండ్రి లేదా తల్లి మాత్రం బాధ్యతల నుంచి విరామం పొందలేరు. కుటుంబంతో కలిసి భోజనం చేయాలన్నా, పిల్లలతో ఆడుకోవాలన్నా విధుల సమయాలు అనుకూలించవు.

తన పిల్లలకు భద్రత, ఆనందం అందించాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. పోలీసు కుటుంబాల్లోని తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలతో పాటు సమాజంలోని ఇతర పిల్లల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని విధులు నిర్వహించాల్సి వస్తుంది. వ్యక్తి గత జీవితానికి, ప్రజా సేవకు మధ్య సమతుల్యత సాధించడం వారికి నిరంతర సవాలుగా మారుతుంది.

ఖాకీ వెనుక కనిపించని కుటుంబ త్యాగం

ఒక పోలీసు అధికారి విధులకు వెళ్లినప్పుడు ఆయన వెనుక కుటుంబ సభ్యుల ఆశలు, ఆందోళనలు ఉంటాయి. విధులు ముగిసే సమయం తెలియకపోవడం, అత్యవసర పిలుపులతో ఇంటికి ఆలస్యంగా చేరడం, సెలవు రోజులల్లోనూ విధులకు హాజరుకావాల్సి రావడం వంటి పరిస్థితులను కుటుంబ సభ్యులు అర్థం చేసుకుని సహకరించాల్సి ఉంటుంది.

పిల్లల పుట్టినరోజులు, కుటుంబ వేడుకలు, బంధువుల శుభకార్యాలకు హాజరుకాలేని సందర్భాలూ ఉంటాయి. తమ కుటుంబ సభ్యుడు ప్రజల సేవలో ఉన్నాడనే గర్వం ఒక వైపు ఉన్నా.. ఆయనతో సమయం గడపలేకపోతున్నామనే బాధ మరోవైపు వెంటాడుతుంది. పోలీసుల సేవ వెనుక కుటుంబ సభ్యుల సహనం, సహకారం, మానసిక ధైర్యం కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

ఆపదలో అండగా.. ప్రజల రక్షణే లక్ష్యంగా

నేరాల నియంత్రణ, మహిళలు మరియు చిన్నారుల రక్షణ, రోడ్డు ప్రమాదాలల్లో సహాయక చర్యలు, ప్రజా శాంతి పరిరక్షణ వంటి అనేక బాధ్యతలను పోలీసులు నిర్వర్తిస్తారు. ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితులు, ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలకు సహాయం అందించడంలోనూ ముందుంటారు.

విధి నిర్వహణలో ఎదురయ్యే ప్రమాదాలు, ఒత్తిళ్లు, అనిశ్చిత సమయాలు వారి వ్యక్తి గత జీవితాలపైనా ప్రభావం చూపుతాయి. అయినప్పటికీ ప్రజలు సురక్షితంగా ఉండాలనే లక్ష్యంతో తమ బాధ్యతలను కొనసాగిస్తారు. వారి సేవలను గుర్తించడం, విధి నిర్వహణలో సహకరించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత.

పోలీసులకు గౌరవం.. ప్రజలకు బాధ్యత

పోలీసుల సేవలను ప్రశంసించడం కేవలం మాటలకే పరిమితం కాకూడదు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, చట్టాలను గౌరవించడం, బహిరంగ ప్రదేశాలల్లో క్రమ శిక్షణతో వ్యవహరించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా చూడటం ద్వారా ప్రజలు పోలీసులకు సహకరించవచ్చు.

అదే సమయంలో ప్రజలతో పోలీసులు మర్యాదగా, న్యాయ బద్ధంగా వ్యవహరించడం, ఫిర్యాదులను బాధ్యతాయుతంగా స్వీకరించడం, బాధితులకు అండగా నిలవడం కూడా అంతే ముఖ్యం. పరస్పర గౌరవం, సహకారం ఉన్నప్పుడే ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడం సాధ్యమవుతుంది.

ఖాకీకి సెల్యూట్‌.. ఆ కుటుంబాలకు అభివందనం

ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్న వేళ విధుల్లో అప్రమత్తంగా ఉండే పోలీసుల సేవలు సమాజానికి ఎంతో అవసరం. వారి వెనుక కుటుంబాలకు దూరంగా గడిపే సమయం, పిల్లలతో పంచుకోలేని ఆనందాలు, ఆత్మీయుల కోసం తీర్చుకోలేని ఎదురు చూపులు ఉంటాయి. ఈ త్యాగాలను గుర్తించడం సమాజం బాధ్యత.

ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేసే ప్రతి పోలీసు సిబ్బందికి అభినందనలు. వారి విధి నిర్వహణకు అండగా నిలుస్తూ, ఎన్నో సందర్భాలలో తమ వ్యక్తిగత ఆనందాలను పక్కనపెట్టే కుటుంబ సభ్యులకు హృదయపూర్వక వందనం. ఖాకీ వెనుక ఉన్నది కేవలం క్రమశిక్షణ కాదు.. ఒక బాధ్యత, ఒక త్యాగం, ప్రజల పట్ల అంకితభావం.

రిపోర్టర్:- నాగేశ్వరరావు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular