ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలి..

వ్యాపారులకు అదనపు కలెక్టర్ హెచ్చరిక
మహబూబాబాద్, ప్రతినిధి నవంబర్ 02 (ద్రోణ):- ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధరలకే బియ్యం విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘించి వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తే సంబంధిత వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. అనిల్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో బియ్యం విక్రయదారులకు పలు సూచనలు చేశారు.
సామాన్య ప్రజలకు నాణ్యమైన బియ్యం సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రైవేటు బియ్యం విక్రయ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధరలు అమలయ్యేలా పర్యవేక్షణ చేపట్టినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట విక్రయ ధరల ప్రకారం తెలంగాణ బీపీటీ బియ్యం కిలో రూ.66, తెలంగాణ సోనా బియ్యం కిలో రూ.74, తెలంగాణ శ్రీరామ్ గోల్డ్ బియ్యం కిలో రూ.79కు విక్రయించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
రైస్ మిల్లర్లు, వ్యాపారులు, హోల్‌సేల్ డిపో నిర్వాహకులు, రిటైలర్లు నిర్ణయించిన ధరలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిర్దేశిత ధరలకు మించి విక్రయాలు జరిపినా, వినియోగదారుల నుంచి అదనపు మొత్తాలు వసూలు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
వినియోగదారులకు ధరలపై స్పష్టత ఉండేలా ప్రతి విక్రయ కేంద్రంలో ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధరల వివరాలను ప్రజలకు కనిపించే విధంగా బ్యానర్లు ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బియ్యం విక్రయాలు నిర్వహించాలని సూచించారు.