వాహనాల దారి మళ్లింపు
ట్రాక్ నిర్వహణ పనులతో వాహనాల దారి మళ్లింపు..
నవీపేట్, నవంబర్ 2 (ద్రోణ):- జానకంపేట్ రైల్వే గేట్ వద్ద ట్రాక్ నిర్వహణ పనుల నేపథ్యంలో నాలుగు రోజుల పాటు రాకపోకలను నిలిపివేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఎల్ సీ నంబర్ 1 జేబీ జానకంపేట్ రైల్వే గేటును నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు మూసి వేయనున్నట్లు రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ట్రాక్ ఓవర్ హాలింగ్ పనుల నిర్వహణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలి
జానకంపేట్ రైల్వే గేటు మూసివేతతో నిజామాబాద్ నుంచి బాసర వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. దూపల్లి వద్ద ఉన్న ఎల్‌సీ నంబర్ 5 జేబీ గేట్ మీదుగా, అలాగే సాటాపూర్ వద్ద ఉన్న ఎల్ సీ నంబర్ 10 గేట్ ద్వారా వాహనాలను మళ్లించినట్లు పేర్కొన్నారు.
ట్రాక్ నిర్వహణ పనులు పూర్తయ్యే వరకు వాహనదారులు రహదారి మళ్లింపు మార్గాలను అనుసరించి రైల్వే శాఖకు సహకరించాలని అధికారులు కోరారు.
రిపోర్టర్: ఎం. నాగేశ్వరరావు