నాలుగు గ్రామాల విద్యార్థులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలి

విద్యార్థుల రవాణా సమస్యను తక్షణమే పరిష్కరించాలి..

ఆర్టీసీ అధికారులకు విద్యార్థి పరిషత్ వినతి

బోధన్ టౌన్ ప్రతినిధి 2 (ద్రోణ):- గ్రామీణ ప్రాంతాల నుంచి బోధన్ పట్టణంలోని విద్యా సంస్థలకు వెళ్లే విద్యార్థుల రవాణా సమస్యను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులు ఆర్టీసీ అధికారులను కోరారు. కందకుర్తి, పేపర్ మిల్, నీలా, సాటాపూర్ గ్రామాల విద్యార్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ కార్యదర్శి మదరోళ్ల నిఖిల్ బోధన్ ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఉదయం 8.30 గంటలకు కందకుర్తి నుంచి బోధన్‌కు, సాయంత్రం 4.30 గంటలకు బోధన్ నుంచి కందకుర్తికి ప్రత్యేక బస్సులు నడపాలని కోరారు. ఆయా గ్రామాల నుంచి బోధన్ పట్టణంలోని పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ప్రతి రోజు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

సరైన సమయంలో బస్సులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు విద్యాసంస్థలకు ఆలస్యంగా చేరుకుంటున్నారని పేర్కొన్నారు. దీని వల్ల తరగతులకు హాజరు కావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. విద్యార్థుల విద్యా భ్యాసానికి ఆటంకం కలగకుండా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

విద్యార్థుల సమస్యను అధికారులు ప్రాధాన్యంగా తీసుకుని, ఆలస్యం చేయ కుండా తగిన చర్యలు చేపట్టాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థి పరిషత్ సభ్యులు అర్ఫత్ ఖాన్, షేక్ ఖాజా మొయినుద్దీన్ తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.

రిపోర్టర్:-యం. నాగేశ్వరావు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular