భద్రతా నిబంధనలు పాటించ కుంటే లైసెన్సులు రద్దు.. చట్టపరమైన చర్యలు

వ్యాపారులకు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య స్పష్టమైన హెచ్చరిక
నిజామాబాద్, ప్రతినిధి నవంబర్ 2 (ద్రోణ):- దీపావళి పండుగ వేళ బాణసంచా విక్రయాల పై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. టపాసుల వ్యాపారంలో భద్రతా ప్రమాణాలను తూచా తప్పకుండా పాటించాలని, నిబంధనలను ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య హెచ్చరించారు. పండుగ సంబరాలు ప్రమాదాలకు దారితీయ కుండా ప్రతి దుకాణం వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు.
బాణ సంచా విక్రయాలకు సంబంధించి తాత్కాలిక లైసెన్సుల జారీ, ప్రభుత్వ నిబంధనల అమలు పై సోమవారం పోలీస్ కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ హాల్లో క్రాకర్స్ అసోసియేషన్ ప్రతి నిధులు, హోల్‌సేల్ వ్యాపారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపారులకు పలు సూచనలు చేశారు.

అనుమతులు లేకుండా బాణ సంచా విక్రయాలు చేపట్టరాదని, సంబంధిత అధికారుల నుంచి లైసెన్సులు పొందిన దుకాణాలకే విక్రయాలకు అనుమతి ఉంటుందని తెలిపారు. ప్రతి షాపులో అగ్నిమాపక పరికరాలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని, రెండు ఇసుక బకెట్లు, రెండు నీటి బకెట్లు సిద్ధంగా పెట్టుకోవాలని ఆదేశించారు. విద్యుత్ ప్రమాదాలు, షార్ట్సర్క్యూట్లు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
దుకాణం ముందు లైసెన్స్ ప్రతిని స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించడంతో పాటు పొగతాగడం నిషేధమనే హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పారు. షాపుల పరిసరాల్లో పొగతాగడం, అగ్గిపుల్లలు, లైటర్లు వినియోగించడం, వంట చేయడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. 18 ఏళ్లలోపు వారికి బాణసంచా విక్రయించరాదని, దుకాణాల వద్ద టపాసులు కాల్చి ప్రదర్శనలు చేయకూడదని పేర్కొన్నారు.
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు బాణసంచా దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలను పాటించకుండా వ్యాపారాలు నిర్వహిస్తే సంబంధిత యజమానులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దీపావళి పండుగను ప్రజలంతా సురక్షితంగా జరుపుకునేలా వ్యాపారులు పోలీస్ శాఖకు సహకరించాలని కమిషనర్ కోరారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ సహాయం కోసం 112, అగ్నిమాపక సేవల కోసం 101 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.

ఈ సమావేశంలో ఏసీపీ ప్రకాష్, టౌన్ సీఐ సత్యనారాయణ, రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్హెచ్ఓ శ్రీనివాస్, ఎస్ఐలు యాదగిరి గౌడ్, హరిబాబు, సాయన్న, సునీల్‌తో పాటు క్రాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పేట సంతోష్, కార్యదర్శి పసుమర్తి ప్రవీణ్, కోశాధికారి బొంపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.