వర్ని 30 పడకల ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి

వర్ని, నవంబర్ 03(ద్రోణ):- ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు.

వర్ని మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించి అక్కడి వైద్య సేవలు, సదుపాయాలపై సమీక్షించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను స్వయంగా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు సకాలంలో అందుబాటులో ఉంటున్నారా? అవసరమైన చికిత్స, మందులు అందుతున్నాయా? ఆసుపత్రిలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయనే విషయాలను రోగులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం డీసీహెచ్‌ఓ శ్రీనివాస్ ప్రసాద్‌తో మాట్లాడి ఆసుపత్రిలో ప్రస్తుతం పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది వివరాలను తెలుసుకున్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, అదనపు వైద్య సిబ్బంది అవసరం, వైద్య పరికరాల సమకూర్పు, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు.

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగేలా వైద్య సేవల నాణ్యతను మెరుగుపరచాలని, రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని వైద్యాధికారులకు సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణలో ప్రభుత్వ ఆసుపత్రులు కీలక పాత్ర పోషించాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.