ఎరువుల దుకాణం నిర్వహణకు రూ.30 వేలు డిమాండ్..
గతంలోనే రూ.10 వేల వసూలు
సంగారెడ్డి, ప్రతినిధి నవంబర్ 03:- అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు మరో ప్రభుత్వ అధికారి చిక్కారు. ఎరువుల వ్యాపారానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూస్తానంటూ లంచం డిమాండ్ చేసిన సదాశివపేట మండల వ్యవసాయ అధికారి జి. రమేష్ రూ.20 వేల నగదు స్వీకరిస్తూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. ఫిర్యాదుదారుడి అల్లుడు నిర్వహిస్తున్న ఎరువుల దుకాణం వ్యాపారంలో ఇబ్బందులు కలగకుండా చూసేందుకు వ్యవసాయ అధికారి మొత్తం రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా గత నెల 19న ఇప్పటికే రూ.10 వేలు తీసుకోగా, మిగిలిన రూ.20 వేల కోసం ఒత్తిడి చేసినట్లు తెలిపారు.
ఈ క్రమంలో మంగళవారం తన కార్యాలయంలోనే మిగిలిన లంచం సొమ్మును స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడి నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు.
ప్రభుత్వ విధులను అడ్డుపెట్టుకుని అక్రమంగా లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ అధికారిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని హైదరాబాద్‌లోని రెండో అదనపు ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.