
దాడికి పాల్పడిన వారిపై హత్య కేసు నమోదు..
హైదరాబాద్, నవంబర్ 04 (ద్రోణ):-బాధిత కుటుంబానికి ప్రభుత్వ అండ
కండక్టర్ ప్రవళిక మృతి ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఉద్యోగిపై దాడి జరగడం, అనంతరం ఆమె ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులపై హత్య కేసు నమోదు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రవాణా శాఖ సిబ్బందికి విధి నిర్వహణలో ఏవైనా సమస్యలు ఎదురైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. అంతేగానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులకు పాల్పడటం ఎంతమాత్రం సమర్థనీయం కాదని హెచ్చరించారు.
ప్రవళిక కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు