అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. ఎంపీ అర్వింద్‌కు కాంగ్రెస్ సవాల్

ఎనిమిదేళ్ల ఎంపీ పదవీకాలంలో జిల్లాకు ఏం చేశారో చెప్పాలి

మాధవనగర్ ఆర్వోబీకి రూ.101.80 కోట్లతో నిధులు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే
డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి

నిజామాబాద్, ప్రతినిధి నవంబర్ 05 (ద్రోణ):- జిల్లాలో అభివృద్ధి పనులపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. గత ఎనిమిదేళ్లలో ఎంపీగా ఉన్న ధర్మపురి అర్వింద్ జిల్లాకు చేసిన అభివృద్ధి ఏమిటో వెల్లడించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పదకొండు నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి సవాల్ విసిరారు.

గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, మేయర్ ఉమారాణితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చొరవతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జిల్లాలోని రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, ఇతర అభివృద్ధి పనులపై చర్చించినట్లు తెలిపారు.

మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి 2021లో రూ.93.12 కోట్లు కేటాయించగా, జీఎస్టీ 12 శాతం నుంచి 18 శాతానికి పెరగడంతో అదనపు వ్యయం ఏర్పడిందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో రూ.8.68 కోట్లు పెంచి మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.101.80 కోట్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. ఈ నెల 24న ముఖ్యమంత్రిని కలిసి ఆర్వోబీ అంశంపై చర్చించి జీవో విడుదల చేయించిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే ఈ పరిణామాలను పక్కనపెట్టి ఎంపీ అర్వింద్ రాజకీయ ఉనికి కోసం ధర్నా చేపట్టారని విమర్శించారు.

మాధవనగర్ బ్రిడ్జి నిర్మాణంలో జాప్యానికి కేంద్ర రైల్వే శాఖ నిర్ణయాలే కారణమని నగేష్ రెడ్డి ఆరోపించారు. గతంలో బ్రిడ్జి ఎత్తును 5.6 మీటర్లుగా నిర్ణయించగా, ప్రస్తుతం 6.25 మీటర్లకు పెంచడంతో ఇంజినీర్లు డిజైన్‌ను తిరిగి రూపొందించాల్సి వచ్చిందన్నారు. ఈ కారణంగా పనుల్లో జాప్యం జరుగుతోందని, వాస్తవాలను వివరించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం తగదన్నారు.

జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ.. నిజామాబాద్‌కు వ్యవసాయ కళాశాలను మంజూరు చేయించడంతో పాటు యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని 60 డివిజన్ల అభివృద్ధికి ఒక్కో డివిజన్‌కు రూ.కోటి చొప్పున రూ.60 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో సుమారు రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, భీంగల్ నుంచి బాసర వరకు హైవే నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. లింబాద్రి గుట్ట అభివృద్ధికి రూ.4 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

పసుపు బోర్డు తీసుకొచ్చామని ఎంపీ అర్వింద్ గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, దాని ద్వారా రైతులకు ఒనగూరిన ప్రయోజనాలను స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ ప్రాజెక్టును తీసుకువచ్చిన బండి సంజయ్ తరహాలో నిజామాబాద్‌కు ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని, సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని విమర్శించారు. సుదర్శన్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో గుత్ప, అలీసాగర్ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు, నిజామాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. ప్యాకేజీ 20, 21 కింద రూ.800 కోట్లు ఖర్చు చేసి సాగునీటి వసతుల కల్పనకు కృషి చేశారని, అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేయడంలో విఫలమైందని ఆరోపించారు. మరో రూ.300 కోట్లు ఖర్చు చేసి ఉంటే సుమారు 85 వేల ఎకరాలకు సాగునీరు అందేదని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, డిజైన్ల మార్పులపై కూడా ఆయన బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. ప్రాజెక్టు విషయంలో చోటుచేసుకున్న నిర్ణయాలు, వ్యయాలపై సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. రైతులకు సుమారు రూ.22 వేల కోట్ల రుణమాఫీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నధాన్యానికి బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. గతంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురుచూడాల్సి వచ్చేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు.

జిల్లా అభివృద్ధిపై ఎంపీ అర్వింద్ బహిరంగ చర్చకు రావాలని, తమ ప్రభుత్వం చేపట్టిన పనులు, ఆయన ఎంపీగా ఉన్న కాలంలో చేసిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని నగేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకనైనా అసత్య ఆరోపణలు మానుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధార విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

ఈ సమావేశంలో డీసీసీ కోశాధికారి భక్తవత్సలం, ఉపాధ్యక్షుడు కౌడపు శరత్ కుమార్, మహిళా నగర అధ్యక్షురాలు రేవతి, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు బెన్సన్ రాజు, సీనియర్ నాయకులు మీసాల సుధాకర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి రవి, కార్పొరేటర్ పంచారెడ్డి చరణ్, డీసీసీ కార్యదర్శులు సుభాష్, మూల్గురి గణేష్, కౌడపు రఘు, నయీం షార్హన్, నరేందర్, పోలా శంకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular