
రైతుల అభ్యున్నతే లక్ష్యంగా సహకార సంఘం సేవలు
బోధన్, నవంబర్ 05 (ద్రోణ):- పెంటాఖుర్ధ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి నూతన నాయకత్వం బాధ్యతలు చేపట్టింది. బోధన్ మండల పరిధిలోని ఈ సొసైటీ చైర్‌పర్సన్‌గా శ్రీనివాసరావు గురువారం అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ అమర్నాథ్ బాబు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.
నూతన చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించిన ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డికి శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. సహకార సంఘం ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు సంఘం అభివృద్ధికి కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు.
బాధ్యతల స్వీకరణ కార్యక్రమం సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులకు గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బోధన్ ఏఎంసీ చైర్మన్ నాగేశ్వరరావు, చిట్టెపు కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఉద్యమ నేత శివసాయి పటేల్, గ్రామ పెద్దలు, రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.