రెడ్ క్రాస్ సేవలను అభినందించిన డాక్టర్ వర్షిణి

తలసేమియా చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

రెడ్ క్రాస్ తలసేమియా వార్డును సందర్శించిన వైద్య నిపుణురాలు డాక్టర్ వర్షిణి బండి

నిజామాబాద్, ప్రతినిధి నవంబర్ 06( ద్రోణ):- ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తలసేమియా వార్డును హైదరాబాద్‌లోని {ఏ ఓ ఐ} సిటిజెన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ పీడియాట్రిక్ హెమటాలజీ, ఆంకాలజీ, బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ నిపుణురాలు డాక్టర్ వర్షిణి బండి సందర్శించారు. ఈ సందర్భంగా వార్డులో చికిత్స పొందుతున్న తలసేమియా బాధిత చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి, వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.

చిన్నారుల తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె తలసేమియా వ్యాధి నిర్వహణ, చికిత్సలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పిల్లలకు నిర్ణీత వ్యవధిలో వైద్య పరీక్షలు చేయించాలని, వైద్యుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని సూచించారు. వ్యాధి నియంత్రణలో తల్లిదండ్రుల అప్రమత్తత, నిరంతర పర్యవేక్షణ ఎంతో కీలకమని వివరించారు.

అనంతరం వార్డులోని సౌకర్యాలు, పరిశుభ్రత, చిన్నారులకు అందిస్తున్న సేవలను పరిశీలించిన డాక్టర్ వర్షిణి బండి రెడ్ క్రాస్ జిల్లా శాఖ నిర్వహణ తీరును అభినందించారు. తలసేమియా బాధిత చిన్నారులకు అండగా నిలుస్తూ, వారి ఆరోగ్య పరిరక్షణ కోసం సంస్థ చేపడుతున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో అందిస్తున్న సేవలు మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ పోతంకర్ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ డాక్టర్ శీను నాయక్, కోశాధికారి కెంపుల నాగరాజు, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular