జంపాల ప్రసాద్ ఆశయాలే విద్యార్థి ఉద్యమాలకు దిక్సూచి…

50 ఏళ్ల అమరత్వ స్ఫూర్తితో బోధన్‌లో పీడీఎస్‌యూ భారీ ర్యాలీ
బోధన్, నవంబర్ 5 (ద్రోణ):- విద్యార్థుల హక్కుల సాధన, సమాన విద్యా వకాశాలు, సామాజిక సమానత్వం కోసం జీవితాన్ని అంకితం చేసిన విప్లవ విద్యార్థి నేత కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ఆశయాలు నేటికీ విద్యార్థి లోకానికి స్ఫూర్తిదాయకమని (పీడీఎస్‌యూ) నిజామాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్. గౌతమ్ కుమార్, జన్నారపు రాజేశ్వర్ పేర్కొన్నారు.

జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ 50వ అమరత్వ సంస్మరణను పురస్కరించుకుని గురువారం బోధన్ పట్టణంలో (పీడీఎస్‌యూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ విద్యార్థి ప్రదర్శన నిర్వహించారు. శక్కర్‌నగర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు సాగిన ర్యాలీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమరుడి ఆశయాలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఫ్రెంచ్ విద్యార్థి ఉద్యమాలు, నక్సల్బరీ, శ్రీకాకుళం పోరాటాల స్ఫూర్తితో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో బలపడిన విద్యార్థి ఉద్యమాలకు జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ విశేష సేవలందించారని తెలిపారు. కామ్రేడ్ జార్జిరెడ్డి పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పీడీఎస్‌యూను బలోపేతం చేశారని గుర్తుచేశారు. విద్యా రంగ సమస్యల పరిష్కారం, విద్యార్థుల హక్కుల పరిరక్షణ, శాస్త్రీయ విద్యా విధానం, సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణం కోసం ఆయన నిరంతరం పోరాడారని వివరించారు.
ఎమర్జెన్సీ కాలంలో పాలకుల నిర్బంధ విధానాలకు బలైన జంపాల ప్రసాద్ మరణించి ఐదు దశాబ్దాలు గడిచినా ఆయన పోరాట స్ఫూర్తి విద్యార్థులలో కొనసాగుతోందన్నారు. నేటికీ దేశ వ్యాప్తంగా విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రశ్నించే గొంతులను అణచివేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఢిల్లీ, బీహార్ తదితర ప్రాంతాలలో విద్యార్థుల ఆందోళనలు ఉద్రిక్తత అవుతామని అన్నారు నేపథ్యంలో హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్య మించాల్సిన అవసరం ఉందన్నారు. జంపాల ప్రసాద్ ఆశయాలను కొనసాగిస్తూ విద్యా రంగ సమస్యల పై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

త్యాగాల చరిత్రను మరువరాదు
(పీడీఎస్‌యూ) మాజీ రాష్ట్ర కార్యదర్శి, అడ్వకేట్ జి. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలను అణచి వేసి ప్రజా స్వామిక హక్కులను కాలరాసిన ఎమర్జెన్సీ పాలనలో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నీలం రామ చంద్రయ్యలను విజయవాడలో అదుపులోకి తీసుకుని ఖమ్మం జిల్లా ఇల్లందు తాలూకాలోని చీకటిగండి అటవీ ప్రాంతంలో హత మార్చారని ఆరోపించారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లు వెత్తాయని గుర్తుచేశారు.
జంపాల ప్రసాద్ వంటి త్యాగ శీలి బోధన్ మండలంలోని ఎత్తొండ గ్రామానికి చెందిన వ్యక్తి కావడం ఈ ప్రాంత ప్రజలకు గర్వకారణమన్నారు. ఆయన ఆశయాల సాధనకు విద్యార్థులు కృషి చేయాలని, సమాన విద్యా వకాశాలు, శాస్త్రీయ విద్యా విధానం, సమ సమాజ స్థాపన లక్ష్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు మారుతున్నా పాలకుల విధానాలలో ఆశించిన మార్పు రావడం లేదని విమర్శిస్తూ, ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో (పీడీఎస్‌యూ) జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్. కార్తీక్, సహాయ కార్యదర్శి ప్రిన్స్, కోశాధికారి సాయినాథ్, జిల్లా కమిటీ సభ్యులు పవన్, భవాని, ఆకాష్, హరికృష్ణతో పాటు నాయకులు హనుమంత్ రెడ్డి, శ్రీకర్, సచిన్, వరప్రసాద్, పుష్పలత, భాను తదితరులు పాల్గొన్నారు.