Friday, February 13, 2026

బోధన్ లో ఇసుక దుమారం

ఫోటోలు తీసుకుంటే తీసుకోండి
మా దందాను నివారించలేరు
మీకు ఒరిగేదేమీ లేదు
ఇబ్బంది పెడితే మాత్రం మీ అంతు చూస్తాం

ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాధుడే కరువు,,

బోధన్ నియోజకవర్గంలో ఇసుక తుఫాను చెల రేగుతుంది. గత 15 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మంజీరా అంచున ఉన్న గ్రామాల్లో ఇసుక మాఫియాదారులు గుంట నక్కలు గా కాపు కాస్తున్నారు. రాష్ట్రంలో అధికార పగ్గాలు ఎవరు చేపట్టిన, బోధన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేవారు ఎంతటి వారైనా సరే ఇసుకాసుర్లు మాత్రం తమ పని తాము మూడు పువ్వులు ఆరు కాయలుగా నిర్వహిస్తున్నారు. మాజీమంత్రి ప్రస్తుతం బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అక్రమార్కులపై కొరడా ఝాలిపించాలని అక్రమాలకు తెరదించాలని అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన సందర్భం లో ఎన్నోసార్లు అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. అక్రమాలకు అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించినప్పటికీ అధికారుల్లో చలనం ఉండడం లేదు. బోధన్ ప్రాంతం నుండి ప్రతినిత్యం నిజాంబాద్ బోధన్ పట్టణాలకు సుమారు 50 నుండి 100 టిప్పర్ల ద్వారా ఇసుకను రవాణా చేస్తున్నారు. అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్లకు నంబర్లు సరిగా కనపడకుండా చేస్తున్నారు. ఇసుక మాఫియాదారులు వారి ఆగడాలకు అంతే లేదని చెప్పుకోవచ్చు. రాత్రివేళ డోజర్ల సహాయంతో టిప్పర్లలో ఇసుకను లోడింగ్ చేస్తున్నారు. పట్ట పగలే మంజీరా నది నుండి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించి వారికి అనుకూలమైన ప్రదేశాల్లో ఇసుక నిల్వ చేస్తున్నారు. అక్రమ ఇసుక వ్యాపారులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు నెల మామూళ్ళు చెల్లిస్తున్నామని బహిరంగంగానే చర్చ కొనసాగుతుంది. ఎవరు ఏమనుకున్నా సరే ప్రతి నెల అధికారులకు లక్షల్లో డబ్బు వచ్చి జేబుల్లో చేరుతుంది. రాత్రివేళ అక్రమంగా టిప్పర్లలో ఇసుకను అక్రమార్కులు నిజాంబాద్ ఎలా చేర్చగలుగుతున్నారు. రాత్రివేళ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎడపల్లి పోలీసులు ప్రతినిత్యం జానకంపేట చౌరస్తాలో మకాం వేస్తున్నారు. జానకంపేట చౌరస్తాలో పోలీసులు అక్రమ రవాణాను సాఫీగా కొనసాగించేందుకు రక్షణగా పోలీసులు నిలబడుతున్నారా,,? మరి ఏమి జరుగుతుంది అనే అంశం పెద్ద చర్చగా మారింది.బోధన్, ఎడపల్లి, నవీపేట్, నిజాంబాద్ పట్టణంలోని పలు పోలీస్ స్టేషన్లకు అక్రమార్కులు ప్రతినెల నెల మామూలు చెల్లిస్తున్నామని ఇసుక మాఫియాదారులే బహిరంగంగా చెబుతున్నారు. అక్రమ ఇసుక రవాణాపై ఎవరేమనుకున్నా ఎవరేమి చేసిన నడిపేది అక్రమార్కులే డబ్బు వసూలు చేసేది మేమే అన్న చందంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లో ఇసుక రవాణా తో గ్రూపు తగాదాలు పెద్ద ఎత్తున నెలకొంటున్నాయి. మరోపక్క ఈజీ మనీతో గ్రామాల్లో ఎంతోమంది మద్యానికి బానిసలవ్వడం, జూదం ఆడేందుకు పెద్ద ఎత్తున శ్రద్ధ చూపుతున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు, జూదమాడించే ఏజెంట్లు, అక్రమ ఇసుక రవాణా దారులు అందరూ ప్రతినెల పోలీస్ లకు నెల మామూళ్ళు చెల్లిస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

రాసుకుంటే రాసుకోండి ఫోటోలు తీసుకుంటే తీసుకోండి

మాకు జరిగే ఇబ్బంది లేదు మీకు ఒరిగేది ఏమీ లేదు

ప్రభుత్వ పనులకు కొన్ని సందర్భాల్లో రెవిన్యూ అధికారులు ఇసుక రవాణాకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. రవాణా చేసే సమయంలో వే బిల్లులు వాహనాలకు అందించాల్సి ఉండగా రెవిన్యూ అధికారులు వే బిల్లుల విషయంలో పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇసుక రవాణాకు అనుమతి మంజూరు చేసినట్లు, వారు కట్టిన డిడి డబ్బులను పొందుపరుస్తూ, ఇన్ని ట్రాక్టర్లు, ఇన్ని టిప్పర్లు రవాణా చేసుకోవచ్చని రాజముద్ర వేసి అనుమతి పొందిన వారికి అందజేస్తున్నారు. అనుమతుల ముసుగులో పెద్ద ఎత్తున అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుందని గ్రామాల్లోని ప్రజలు, కొంతమంది మీడియా ప్రతినిధులు గగ్గోలు పెట్టిన రెవెన్యూ అధికారులు తాము ఏమీ చేయలేమని తమ దగ్గర సిబ్బంది లేరని మరోపక్క ఎన్నికల విధుల్లో ఉన్నందున ప్రస్తుతం అక్రమాలకు అడ్డుకట్ట వేయలేమన్న చందముగా రెవిన్యూ అధికారులు సమాధానం చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. మరో బోధన్, సాలూర, రెంజల్ మండలాల్లో అక్రమార్కులు చీకటైందంటే చాలు పాగా వేసి కూర్చుంటున్నారు. ప్రతినిత్యం బోధన్ మండలంలోని సిద్దాపూర్, కోపర్గా, హాంగ్గర్గ,i కండుగావ్, రెంజల్ మండలం సాటాపూర్ నుండి ప్రతినిత్యం అక్రమంగా ఇసుక రవాణా యదేచ్ఛగా కొనసాగుతుంది. గ్రామాల్లో ఎవరైనా అడ్డుకున్న లేదా అధికారులకు సమాచారం ఇచ్చిన వారి భరతం పడతారు. మరోపక్క పోలీస్ శాఖ 108 ఫిర్యాదులకు ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది. 108కు ఫోన్ చేసి ఎవరైనా సమాచారం ఇస్తే ఆ సమాచారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచకుండా, అక్రమార్కులకు ఫలానా వ్యక్తులు పోలీస్ శాఖకు ఫిర్యాదు చేశారని ప్రస్తుతం మీరు జాగ్రత్తగా ఉండి మీ బండ్లను పక్కకు పెట్టాలని పోలీస్ గుంటనక్కలే అక్రమ రవాణా దారులకు వంట పాడుతున్నారు. అక్రమార్కుల కథనాన్ని వెలుగులోకి తేవాలని కొంతమంది జర్నలిస్టులు ప్రయత్నం చేసిన అధికారులు మాత్రం చలనం కలగడం లేదు. సోషల్ మీడియాకు చెందిన కొందరు అక్రమంగా నిల్వలుంచిన ఇసుక ఫోటోలు తీసే ప్రయత్నం, టిప్పర్లలో లోడు చేసే సందర్భాల్లో, రవాణా అయ్యే సందర్భాల్లో ఫోటోలు తీసే ప్రయత్నం చేసిన ఫోటోలు తీసుకుంటే తీసుకోండి, మాకు మాత్రం ఏమీ కాదు, మీకు మాత్రం ఒరిగేదేమీ లేదు, తీవ్ర పరిణామాలు మాత్రం ఫోటోలు తీసిన వారు ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు అక్రమార్కులు హెచ్చరికలు జారీ చేసేందుకు వెనకడుగు వేయడం లేదు. ఇంత జరుగుతున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గత రెండు రోజుల క్రితం అక్రమ ఇసుక రవాణాకు కొందరు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. అటువంటి వ్యక్తుల భరతం పట్టారు. అక్రమార్కులు వారిదే పైచేయిగా నిలుపుకున్నారు.

టిప్పర్లను సీజ్ చేసిన బోధన్ పోలీసులు

అక్రమార్కుల ఆగడాలకు అంతే లేకుండా పోయింది. అక్రమార్కులకు అడ్డొచ్చిన వారి భర్త మాత్రం పట్టారు. ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో ఈ విషయం జిల్లా అంతా వ్యాప్తి చెందింది. మరోపక్క బాధితుల గోడు పలువురు వద్ద వెళ్ళబోసుకుంటూ విషయం ఉన్నతాధికారుల వద్దకు చేరింది. ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భాల్లో పోలీసులు హడావిడి చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. ప్రతినిత్యం కొనసాగుతున్న అక్రమ రవాణాకు రాత్రి పగలు అనే తేడా లేకుండా పోలీస్ శాఖ ప్రధానంగా వారికి అండగా నిలబడుతుందని పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతుంది. ఇసుక టిప్పర్లను నిజాంబాద్ చేర్చాలంటే కనీసం మూడు నుండి ఐదు పోలీస్ స్టేషన్లను దాటాల్సి ఉంది, అయినప్పటికీ అక్రమార్కులు తమ వ్యాపారాన్ని సాఫీగానే కొనసాగిస్తున్నారు. ప్రతి ప్రధాన కూడలి వద్ద సీసీ కెమెరాలు పోలీసులు అమర్చారు. అక్రమార్కుల భాగవతం సీసీ కెమెరాలు పోలీసులు బంధిస్తున్నారు. పోలీసులు అక్రమ రవాణా పై ఎవరైనా ప్రశ్నిస్తే తమ దృష్టికి రాలేదని, అలాంటి అక్రమ రవాణా ఏమైనా కొనసాగితే చర్యలు తీసుకుంటామని చేతులు దులుపుకుంటున్నారు. రాత్రివేళ గస్తీ కాస్తున్న పోలీసులు వారి బాసులు మామూళ్ల మాయలో పడి అక్రమ వ్యాపారులకు అండగా నిలబడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అక్రమార్కుల దాటికి తట్టుకోలేక గ్రామాల్లోని ప్రజలు మంజీరా నదిలో ఇసుక కొల్లగొడితే భూగర్భంలో నీళ్లు ఒక్కటే ఇనికి పోతాయి. కానీ వారికి అడ్డు వస్తే నిత్యజీవితంలో ఎన్నో ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని సామాన్య ప్రజలు తమ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు జరిగిన సందర్భాల్లో పోలీసులే అక్రమ రవాణాను రెండు రోజులు నిలిపివేయాలని అక్రమార్కులకు సమాచారాన్ని అందిస్తూ ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు మూడు రోజుల తర్వాత తిరిగి యధావిధిగా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతూనే కొన్ని ఏళ్లు గడిచాయి. ఇప్పుడు మాత్రం అక్రమ ఇసుక రవాణాను పోలీసులు రెవెన్యూ శాఖ నిలుపుదల చేయడంలో వారి నిజాయితీని నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular