ప్రధాన రాజకీయ పార్టీలు
పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఉపాధి ప్రదేశాల్లో చేపడుతున్న వైనం





పార్లమెంట్ ఎన్నికలవేళ రాజకీయ పార్టీలు తమ ప్రచార శైలిలో పలు మార్పులు చేసుకుంటున్నాయి. ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ లు తమ ప్రచారాలను ఉపాధి కూలీల వైపు మళ్ళించారు. రాజకీయ పార్టీలు ఉపాధి కూలీల చెంతకు చేరుతున్నారు. గ్రామాల్లో పనులు చేపట్టే ప్రదేశాల్లో ఎక్కువగా కూలీలు పనుల్లో నిమగ్నం కావడంతో రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టి కూలీల మనసును మరలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. భానుడు భగభగ మండడంతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదయం 6 గంటలకు ఉపాధి కూలీలు తమ పనుల ప్రదేశాలకు వెళ్లి పనుల్లో నిమగ్నం అవుతున్నారు. గ్రామ గ్రామాన ఎన్నికల ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలకు శిక్షణను ఇస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు. గ్రామాల్లోని ప్రధాన పార్టీల నాయకులు గ్రామాల్లో ప్రచారం చేద్దామంటే ఉదయం పూట ఓటర్లు ఉండడం లేదు. 10 గంటలు దాటితే భానుడి మంటలకు తట్టుకోలేకపోతున్నారు. మరోపక్క ఎండలో సైతం ప్రచారం చేద్దామన్న నాయకులు తిరుగుతున్నప్పటికీ ఓటర్లు మాత్రం బయటకు వచ్చే పరిస్థితిలో లేరు. ఇవన్నీటిని అధిగమించేందుకు రాజకీయ పార్టీల నాయకులు గ్రామాల్లో అందరూ చూపు ఉపాధి కూలీల వైపు మళ్లించి పనుల ప్రదేశాల్లోకి దర్శనమిచ్చి తమ పార్టీకి చెందిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని వేడుకుంటున్నారు. ఉపాధి హామీ పథకాన్ని ఆనాడు రాజీవ్ గాంధీ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధికి శ్రీకారం చుట్టిందని కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతున్నారు. గతంలో గ్రామాల్లో పనులు చేద్దామన్న కూలీలకు పనులు దొరికేవి కావు. వ్యవసాయం అంతంతమాత్రంగానే కొనసాగేది. రాను రాను వ్యవసాయము పరిశ్రమగా మారడం దేశంలో వచ్చిన మార్పులతో కూలీలకు పనుల కొరత లేకుండా పోయింది. ఆనాటి వలసలు నేడు కనుమరుగు అయ్యాయి అని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో పెను మార్పులు సంభవించాయి. ఆనాడు తెలంగాణ ప్రాంతం నుండి పట్టణాలకు పొట్ట చేత పట్టుకుని వలసలు వెళ్లేవారు. నేడు వలసలు మాట దేవుడెరుగు. మన రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలు నడవాలంటే ఇతర రాష్ట్రాల కార్మికులు మన రాష్ట్రానికి వస్తే కానీ సాఫీగా నడిచే పరిస్థితి లేదు. నేడు నిజామాబాద్ ప్రాంతంలో వరి నాట్లు వేసేందుకు కూడా ఇతర రాష్ట్రాల కూలీలు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల్లో పనిచేసేవారు ఎక్కడ చూసినా ఇతర రాష్ట్రాల వారే దర్శనమిస్తున్నారు. ఆనాటి పరిస్థితుల ను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఉపాధి పథకం కూలీలకు మాత్రం వరంగా మారింది అని చెప్పవచ్చు. నిండు వేసవిలో సైతం గ్రామాల్లోని కూలీలు ఇతర పనులకు స్వస్తి చెప్పి ఉపాధి పనులకు ఉదయాన్నే వెళ్లి ఎండ సమయానికి ఇంటి పట్టున చేరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ ఉపాధి హామీ పథకానికి ఆనాడు ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ శ్రీకారం చుట్టారని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. మరోపక్క కూలీలకు ఏ ఆపద వచ్చిన తాము అండగా ఉంటామని తమ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని కాంగ్రెస్ కార్యకర్తలు కూలీలకు వివరిస్తున్నారు.
కూలీల రేట్లు పెంచింది బిజెపి
ఉపాధి హామీ పథకాన్ని సరళీకృతం చేసి దేశంలోని కూలీలకు ఉపాధి కల్పించిన ఘనత బిజెపి ప్రభుత్వాని దేనని బిజెపి కార్యకర్తలు ఉపాధి కూలీలకు వివరిస్తున్నారు. ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని తమ ప్రభుత్వం పదేళ్ల నుండి కేంద్రంలో అధికారంలో ఉండి ఉపాధి హామీని నిరాటంకంగా కొనసాగించి దేశంలోనే వలసలకు చరమగీతం పాడమని బిజెపి వ్యక్తం చేస్తుంది. మరోపక్క కూలీలకు గతంలో చాలా తక్కువగా డబ్బు చెల్లించేవారని, వారి శ్రమకు తగ్గ ఫలితాన్ని ప్రభుత్వాలు అందించలేకపోయారని తమ ప్రభుత్వం ప్రధాని మోడీ పేద ప్రజల పట్ల ఎంతో కృషి చేస్తున్నారని వివరిస్తున్నారు. మరోపక్క అయోధ్యలో రామ మందిరం నిర్మించిన ఘనత మోడీదేనని దేశంలో పేను మార్పులు తెచ్చిన మోడీని మరోసారి ప్రధానమంత్రి చేయాలని బిజెపి కార్యకర్తలు కూలీలకు అర్థమయ్యేలా చెబుతున్నారు. బిజెపి పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తే రాబోయే రోజుల్లో భారతదేశం తీరుతను మారుతాయని ఓటర్లకు వివరిస్తున్నారు. నిరుపేదలకు రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న బియ్యం కేంద్ర ప్రభుత్వమే సరఫరా చేస్తుందని రాష్ట్రాలు డబ్బా కొట్టుకుంటున్నాయని బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజలకు వివరిస్తున్నారు. కరోనా మహమ్మారి నుండి దేశ ప్రజలను రక్షించిన ఘనత మోడీ వల్లే సాధ్యమైందని అంటున్నారు. మరో ఐదేళ్లపాటు రేషన్ షాపుల ద్వారా పేదలందరికీ ఉచితంగా బియ్యం బిజెపి అందిస్తుందని నోటికాడ తిండిని దూరం చేసుకోవద్దని కూలీలకు వివరిస్తున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అన్నిటిలోనూ కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని వివరిస్తున్నారు.
సంక్షేమాల అమలులో దేశంలోనే నంబర్ వన్ స్థానం బీఆర్ఎస్ వల్ల సాధ్యం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కెసిఆర్ దే నాని భారతదేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయలేనని సంక్షేమ పథకాలు అమలు చేసి పేద ప్రజల ధరిన చేర్చిన గులాబీ దళపతికి పార్లమెంటు ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని గులాబీ తమ్ముళ్లు ఉపాధి పనుల వద్దకు వెళ్లి కూలీలకు వివరిస్తున్నారు. తమ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రాంతం పదేళ్లపాటు సుభిక్షంగా ఉందని రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని సంక్షేమ పథకాల అమల్లో మరింత వేగవంతం చేసే వీలు కల్పించాలని పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే పేద ప్రజలకు మంచి జరుగుతుందని గులాబీ తమ్ముళ్లు కూలీలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
ఉపాధి కూలీలు మాత్రం మనసులో మాట బయటకు పొక్కానివ్వడం లేదు
వచ్చిన వారందరికీ మీకే మా ఓటు
ఉపాధి హామీ కూలీలు మాత్రం తమ వద్దకు ప్రచార నిమిత్తం వచ్చిన పార్టీల నాయకులను మాత్రం నారాజ్ చేయకుండా మీకే మీ పార్టీకే మా ఓటు అంటూ సమాధానం ఇస్తున్నారు. కొంతమంది మహిళా కూలీలు మాత్రం మా గోడును ఎవరు పట్టించుకోవడంలేదని, శ్రమకు తగ్గ ఫలితం రాకపోవడం, సకాలంలో పనులు చేపట్టిన డబ్బులు రావడం లేదని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పనుల ప్రదేశాల్లో కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించడం లేదని వృద్ధులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీల మనోగ తం మాత్రం రాజకీయ పార్టీలకు అంత చిక్కటం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ప్రతి విషయంపై ప్రతినిత్యం స్పందించడంతో కొందరు కూలీలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని అంటున్నారు. మరి కొంతమంది కూలీలు కేంద్రంలో రాబోయేది బిజెపి సర్కారే కదా మళ్లీ మోడీ ప్రధాని అయితే బాగుంటుందని బిజెపికి ఓటు వేసే ధోరణి లో మాటలు వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క పదేళ్లపాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ పలు సంక్షేమ పథకాలు ప్రజల దారిన చర్చిన మాట నిజమేనని, తమకు కేసీఆర్ అంటే ఇష్టమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్, బిజెపికి ఓటు వేస్తే ఎంతో కొంత మాకు ప్రయోజనం కలుగుతుందేమోనని మనోగతాలను కొంతమంది వద్ద వ్యక్తం చేస్తున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్న చందంగా ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. ప్రజలు కూడా బిజెపి కాంగ్రెస్ లపై మొగ్గు చూపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు బలంగా ఉండడంతో పార్టీ ఉనికి కాపాడడంతోపాటు వారి వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకునే పందాలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే.
