తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న రైతన్నలు
పోతంగల్ విశాల సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు కాంటా విషయంలో ఇబ్బందులు కలగా కుండ ఉండేందుకు సహకార సంఘం ఆధ్వర్యంలో వే బ్రిడ్జిను ఏర్పాటు చేశారు. సహకార సంఘం ఆధ్వర్యంలో రైస్ మిల్లు ఉండడం మరోపక్క రైతులకు సౌకర్యవంతంగా ఉండాల్సిన వే బ్రిడ్జి నిర్వహణలో సంఘం పూర్తి నిర్లక్ష్యం చేస్తుందని రైతులు ఆరోపణలు చేస్తున్నారు. కాంట నిర్వహణకు ఓ వ్యక్తిని ఏర్పాటు చేశారు. నిర్వాహకుడు నిర్లక్ష్యం రైతులకు ఇబ్బందికరంగా మారింది. ఉదయం 10:30 అవుతున్న కాంత నిర్వహణ విధులు నిర్వహించే వ్యక్తి సమయపాలన పాటించకపోవడం రైతులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. గత వారం రోజుల నుండి ప్రతినిత్యం ఇదే సమస్య తల ఎత్తుతూ ఉంది. రైతులకు సౌకర్యం కలగడమే కాకుండా కాంట వల్ల సంఘానికి కొంత ఆదాయము ఓనగోరుతుంది. గతంలో ప్రైవేట్ కాంటాల్లో ఎంతోమంది రైతులు నష్టాలను చవి చూశారు. ప్రవేట్ కాంటాల వారు ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడి రైతులను దోచుకున్నారు. ప్రవేట్ వే బ్రిడ్జిలపై రైతులకు అప నమ్మకం ఏర్పడింది. పొతంగల్ మండల కేంద్రంలోని సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కాంట రైతులకు పెద్దదిక్కుగా మారింది. ప్రస్తుతం వరి పంట చేతికందరంతో రైతులు ఎక్కువగా ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. గతంలో గ్రామాల్లోనే వ్యవసాయ క్షేత్రాల వద్ద ప్రైవేట్ వ్యాపారులు కాంటాలు నిర్వహించేవారు. హమాలీల కొరత ఏర్పడడంతో ధాన్యం బస్తాల్లో నింపి హమాలీలు నేరుగా లోడింగ్ చేస్తున్నారు. అట్టి ధాన్యం తూకం వే బ్రిడ్జిల వద్ద వేయాల్సి ఉంటుంది. ఉదయం 8 గంటల నుండి పోతంగల్ విశాల సహకార సంఘం ఏర్పాటు చేసిన కాంట వద్ద రైతులు రెండు మూడు గంటలు పడిగాపులు కాయాల్సి వస్తుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సహకార సంఘం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సంఘం సీఈవో వివరణ కోరగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని నిర్వహణకు ఏర్పాటు చేశామని ప్రతినిత్యం ఉదయం నుండి రాత్రి 11 గంటల వరకు నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఏవైనా ఇబ్బందులు ఉంటే సరిచేస్తామని సీఈవో భరత్ జవాబు ఇచ్చారు.
