Monday, February 16, 2026

ప్రకృతిని కాపాడుకుంటేనే మానవ మనుగడ

చెట్ల పెంపకం, నీటిని పొదుపుగా వాడడం, వర్షం నీరు వృధా పోకుండా భూగర్భ జలాలు పెంచడం, కాలుష్యాన్ని
నివారిస్తేనే భావితరాలకు భవిష్యత్తు ఉంటుంది, ప్రతి ఒక్కరూ బాధ్యతగా నడిచినాడే మానవ మనుగడ సుఖవంతమవుతుంది. లేకపోతే మానవ మనుగడకే ముప్పు ఏర్పడబోతోంది.

గుండెలు మండిపోయే ఎండలు కాస్తూనే ఉన్నాయి. రోజు దినపత్రికలు ప్రజల్ని బెదిరిస్తూనే ఉన్నాయి. రోజువారి ఎండల వేడిని ఉష్ణోగ్రత తీవ్రతను కొలుచుకుంటూ భయపడే వాళ్ళు భయపడుతూనే ఉన్నారు. ఎంత భయపడ్డా కష్టపడక తప్పని వాళ్లు నిండు ఎండలో కూడా పనులు చేస్తూనే ఉన్నారు. ఎండలు ఇంతగా కాయడానికి కారణం ఎవరు? చాలామంది చెట్లు లేకపోవడం కారణమని చెట్లు పెంచితే సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటూ ఉంటారు. కుండలో నీళ్లు పోయాలి కానీ కుండ బాగా ఉండాలి అంతేకాదు నీళ్లు కారకుండా కుండ ఉంటే పోసిన నీళ్ళు అందులోనే ఉంటాయి కానీ పైభాగాన కుండ మంచిగా ఉండి అసలు అడుగుభాగమే లేకుండా ఉంటే ఆ కుండలో ఎన్ని నీళ్లు పోస్తే మాత్రం ఏం ప్రయోజనం?

మా చిన్నప్పుడు బహుశా 1971 ముందు గ్రామాల్లో ఇళ్లను ఎర్రమట్టి, పేడ తో అలుకు పెట్టే వారు. ఇంటిలో చూడడానికి కూడా ఏ రకమైన చెత్త దొరికేది కాదు ఉన్న ఉన్న కాడికి పెంట దిబ్బకు చేరుకునేది. గ్రామాల్లో చెత్త వసూళ్లు పని, గ్రామపంచాయతీకి అసలు ఉండేదే కాదు. ఇప్పుడు ప్రతి పల్లెకు చెత్త వసూలు చేసే మనిషి, దానితో పాటు గ్రామపంచాయతీకి ఒక ట్రాక్టర్, గ్రామానికి ఊరు చివర ఒక డంపు యార్డ్, ఏర్పాటు చేస్తున్నారు. అసలు చెత్త ఎక్కడినుండి వస్తుంది? గతంలో లేని చెత్త ఇప్పుడు ఎందుకు వస్తుంది? మనం ఎవరము గమనించడం లేదు. పొద్దున్నే మన జీవితం పేస్ట్ తో ప్రారంభం పేస్ట్ తో పాటుగా బ్రష్ లు ఆ తర్వాత సబ్బులు సబ్బు పెట్టెలు సబ్బుతో వచ్చే కవర్లు స్నానం చేయడానికి వాడుకునే షాంపూలు ఇలా అనేక రకాల వస్తువులు ఇళ్ళలోకి చొరబడ్డాయి . టెలివిజన్ లు అందులో వచ్చే వ్యాపార ప్రకటనలు వాటిని చూసి కొనుగోలు చేసుకున్న వస్తువులు, రోజువారి కిరాణా సామాన్లు కట్టించే ప్లాస్టిక్ వస్తువులు ఇంటిలో వాడుకునే అనేక రకాల ప్లాస్టిక్ సామాన్లు నిత్య జీవితంలో వాడుకుంటున్న వివిధ రకాల వస్తువులు కుప్పలుగా గ్రామాల్లో పోగవుతూనే ఉన్నాయి. వీటికి తోడు నగరాల పరిస్థితి అయితే ఎప్పుడో చేయి దాటిపోయింది ఒక్కొక్క నగరం టన్నులకొద్ది చెత్తను పోగు చేస్తూనే ఉంది. గతంలో నగర జీవితంలో కూడా ఇంత చెత్త ఉండేదే కాదు. ఇప్పుడు ఎంత చెత్త పోగువుతోందో!ఎవరు కారణం, నిజానికి ఇంతకుముందు మనుషులే, ఇప్పుడున్నది మనుషులే అయినా ఇంత తేడా ఎక్కడి నుండి వచ్చింది . అన్ని రకాల వస్తువులు అందరి దగ్గర ఉండాలని ఒక కొత్త నియమం ముందుకు వచ్చింది. ఇంతకుముందు గ్రామాలు నగరాలు పట్టణాలు కలిమిడిగా ఒకరి వద్ద ఒక వస్తువు ఉంటే దాన్ని వెసులుబాటును బట్టి వాడుకునేవారు ఇప్పుడు అందరి ఇండ్లలో అన్ని సామాన్లు ఉండాలి. ఎవరూ పొరుగు వారిపై ఆధారపడకూడదు. అసలు పొరుగువారు ఉన్నారని కూడా తెలవకూడదు. ఇలా మొత్తం మనిషి జీవితం వస్తువులతో నిండిపోయింది అవసరం లేని వస్తువులు అవసరం లేని సామాన్లు మన ఇంటిలో నిండిపోయి ప్రతి ఇల్లు ఒక వర్క్ షాప్ లాగా తయారైపోయింది. అందువల్ల ఇప్పుడు చెత్త పోగు కావడం తప్పనిసరిగా మారిపోయింది. ఈ చెత్తను సృష్టించింది ఎవరు? అసలు ఈ వినిమయ సంస్కృతి మొదలైన తర్వాత వారి అవసరాల కోసం అనేక రకాల వస్తువులను అందజేయడం ప్రారంభమై ప్రతి ఇంటిలో మళ్లీ వాడుకోవడానికి వీలు లేని చెత్త పోగవుతుంది. మార్కెట్ సంస్కృతి వల్ల చెత్త పోగవుతూనే ఉంది. ఇది ఒక భాగమైతే మరొక అంశం అవసరంలేని విషయం అందరికీ సైకిల్ మోటార్లు,అందరికీ కార్లు,అందరికీ ఫ్రిజ్ లు అందరికీ ఎయిర్ కూలర్లు,ఎయిర్ కండిషనర్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ఇవి చాలా గొప్పగా కూడా కనపడుతూనే ఉంటాయి కానీ మనం గ్రహించాల్సిన విషయం సైకిల్ మోటారు కారు విడుదల చేసే కార్బన్ మోనాక్సైడ్, ఫ్రిడ్జ్ ఎయిర్ కండిషనర్లు విడుదల చేసే క్లోరోఫ్లోరో కార్బన్లు ప్రకృతిని ఎంత ధ్వంసం చేస్తాయో అనేకమంది పర్యావరణ వేత్తలు చెబుతూనే ఉన్నారు . అయినా పేజీల కొద్దీ వ్యాపార ప్రకటనలు అందంగా దినపత్రికలు అచ్చు వేస్తూనే ఉంటాయి కార్ల కంపెనీల ప్రకటనలు కవ్విస్తూనే ఉంటాయి. మధ్యతరగతి వాడు కూడా తనకు కారు ఉండాలని కొనుగోలు చేస్తున్నాడు. అవసరం కంటే మించి కార్లను ఏసీలను హోదా కోసం కొంటూనే ఉన్నారు ఇది గాక పారిశ్రామిక అభివృద్ధి పేరుతో వచ్చిన అనేక పరిశ్రమలు వాటి జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల నదులు విపరీతంగా కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. ఇది గాక వ్యవసాయ రంగాన్ని సాంప్రదాయ పద్ధతుల నుండి దారి మళ్లించి వ్యవసాయంలోకి ఎరువులు క్రిమిసంహారక మందులు ప్రవేశపెట్టి వ్యవసాయ రంగాన్ని కూడా పూర్తిగా కాలుష్యం చేశారు. ఇది గాక జీవావరణాన్ని నాశనం చేశారు ఎలుకలని చంపండి అని పాములను చంపండి అని మన చుట్టూ ఉండే అనేక రకాల జీవులను అంతమొందించడం కోసం పెద్ద పెద్ద ప్రకటనలు బొద్దింకలు చంపడం కూడా ఇప్పుడు ఒక పెద్ద వ్యాపారం ఎలుకలు దోమలు చంపడం కూడా పెద్ద వ్యాపారం ఇలా మొత్తం నేచర్ ను ధ్వంసం చేసి ఉండవలసిన వాతావరణ సమతౌల్యాన్ని పూర్తిగా దెబ్బతీసి ఎండలు పెరిగాయని గుండెలు బాదుకుంటే ఏం ప్రయోజనం. అసలు అభివృద్ధి అంటే ఏమిటి ప్రశాంతంగా బతకడమా ?లేక పటాటోపంగా బతకడమా ?అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం హోదాగా బతకడమే అని అనుకుంటున్నారు. మనిషి తాను నివసిస్తున్న భూమిని అసహ్యించుకోవడం మొదలుపెట్టాడు ఇళ్లలో రకరకాల ఫ్లోరింగులు వివిధ రకాల బండలు టైల్స్ ఇలా ఆధునికత పేరుతో భూమిలోకి ఇంకవలసిన నీటి శాతాన్ని పూర్తిగా తగ్గించేశారు ఇంటిముందు సిమెంట్ రోడ్లు ఊరంతా సిమెంట్ రోడ్లే వాన పడితే భూమిలోకి ఇంకా వలసిన నీరు భూమిలోకి వెళ్లకుండా వరదలుగా మారిపోవడం ఆ వరదలు ప్రమాదకరంగా మారడం మనం చూస్తూనే ఉన్నాం . ఉన్న భూములన్నీ రోడ్లు వేయడానికి ఉన్న నదులన్నీ సాగునీరు కోసం కాకుండా తాగునీటి కోసం వాడుకోవలసిన స్థితికి ఇప్పటికే నగరాలు పెరిగిపోయాయి. వేసవికాలం వస్తే నగరాల్లో నీటి కొరత ఒక సాధారణ సమస్య ,గతంలో ఉంటుండేది ఈ మధ్యకాలంలో గ్రామాల్లో కూడా నీటి కొరత ఏర్పడుతుంది. ఇలా నూతన విధానాలు జీవనశైలి మనిషిని పూర్తిగా మార్చివేసింది. ప్రకృతిని ప్రేమించడం మరిచిపోయి ధ్వంసం చేయడం మొదలుపెట్టాం ఈ వస్తువులన్నింటికీ వాటి సరఫరాకు ఎవరు బాధ్యులు ముమ్మాటికి ఆయా సంస్థల యాజమాన్యాలు బాధ్యత వహించాలి. అవసరం లేని వస్తువులను ఎవరైతే విక్రయిస్తున్నారో వాటిని కట్టడి చేయాలి నిషేధించాలి అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ధ్వంసం అయిపోయిన చెరువులు నదులు వాగులు వంకలు ఎందుకు ధ్వంసం అయ్యాయి పరిశీలన చేయాలి. ఎక్కడపడితే అక్కడ చెలిమేల ద్వారా నీరు తాగిన రైతాంగం ఇప్పుడు బావులు కూడా లేవు పూర్తిగాబోర్ల పైన ఆధారపడి జీవిస్తున్నారు. ఇక విద్యుత్ రంగం అత్యంత ప్రమాదకరంగా కాలుష్యకారకంగా తయారయింది సాంప్రదాయ విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా పక్కదారి పట్టింది హైడల్ విద్యుత్తు పవన విద్యుత్తు సౌర విద్యుత్తు లాంటివి చాలా తక్కువగా వినియోగిస్తూ కాలుష్యానికి ప్రధాన కారణంగా నిలిచి ఉన్న థర్మల్ విద్యుత్ విపరీతంగా ఉత్పత్తి చేస్తున్నారు దానివల్ల ప్రకృతిలో విపరీతమైన కాలుష్య వాయువులు విడుదల అవుతూనే ఉన్నాయి. ఇలా ఎన్నో రకాల కాలుష్య కారకాలను మనం విడుదల చేస్తూనే చెట్లను పెంచడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని అది కూడా ప్రజల బాధ్యత అని కొందరు చెప్పడం బాధాకరం. లాభాలు దండుకునే కంపెనీలు కాలుష్య కారకాలుగా నిలిచే కంపెనీలు వాటి స్వార్థం కోసం ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయి. పబ్లిక్ ను మనం పబ్లిక్ జీవనశైలిని మార్చవలసి ఉంది.పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పూర్తిగా కనుమరుగయ్యే దశకు చేరుకున్నది వ్యక్తిగతంగా ఎవరికి వారు వాహనాలు వినియోగించడం పెరిగిపోయింది. ప్రజా జీవితాన్ని కకావికలం చేస్తున్న ఈ సమస్త ఉత్పత్తులు ప్రజలకు ప్రయోజనకరం అనే భ్రమను విడనాడాలి ఇవన్నీ ప్రజలను విడదీసే కార్యక్రమాలే సాంఘిక జీవనానికి శత్రువులే ఆఖరికి సినిమాలు పార్కులు కూడా అంతర్ధానమైపోయి ఇళ్లలోనే పార్కులు ఇళ్లలోనే సినిమా హాలు కట్టుకునే దశకు చేరుకున్నాము దీనివల్ల సంఘ జీవితం ఉండదు అనేక రకాల పనికిరాని వస్తువులు ఇంటి నిండా పరుచుకుని ఉంటున్నాయి వాతావరణానికి చెరుపు చేస్తున్నాయి మార్కెట్ సంస్కృతి వల్ల నాశనమైన ఈ జీవనశైలిని తప్పనిసరిగా వ్యతిరేకించాలి. నూతన జీవనశైలి కోసం ప్రయత్నాలు ప్రారంభించాలి. అవసరం లేని వస్తువులు నిషేధించాలి సంఘం శరణం గచ్చామి అనే భావాన్ని మనం పెంపొందించుకోవాలి. కాలుష్య నివారణ జరగకుండా చెట్లను పెంచడం వల్ల ప్రయోజనం లేదు కచ్చితంగా కాలుష్య నివారణ జరగాలి అప్పుడు మాత్రమే చెట్ల పెంపకం వల్ల ప్రయోజనం ఉంటుంది. సాంప్రదాయ వ్యవసాయం జీవన విధానం మానవీయ జీవన సరళి సంఘ జీవన సరళి మళ్లీ ముందుకు వస్తేనే ఈ మండే ఎండల నుండి విముక్తి లభిస్తుంది అంతేకానీ ఎండలను నిందించడం లేదా మనల్ని మనం నిందించుకోవడం సరి కాదు. ఎక్కడికక్కడ పర్యావరణ ప్రేమికులు ,ప్రకృతి ప్రేమికులు, సంఘ ప్రేమికులు ,జీవనశైలి పైన అధ్యయనం చేసి మార్పులు చేర్పులకు కావలసిన కార్యాచరణను ప్రారంభించడమే భావితరాలకు మనం ఇవ్వగలిగే సంపదగా ఉంటుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular