… ప్రముఖ సీనియర్ న్యాయవాది మానవ హక్కుల చట్టం గొర్రెపాటి మాధవరావు
సంవత్సరం మే 13న మన రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. మోడీ ప్రభుత్వం 10 ఏళ్లుగా నడుస్తోంది. మళ్ళీ "ఫిర్ ఏక్ బార్- మోడీ సర్కార్" అంటూ ఓట్లు అడగటానికి వస్తున్నారు.బిజెపి ట్రాక్ రికార్డు మీద ఓటింగ్ ఎవరికి వేద్దాం. వాళ్ళ మాటలకీ చేతలకీ బహుత్ ఫరక్:

- రైతుల ఆదాయం 2022 కల్లా డబల్ చేస్తాం: రైతు సోదరా నీ ఆదాయం 2014 కన్నా 2022 నాటికి డబల్ అయిందా? అలా కావాలంటే సాగు లో నువ్వు వాడే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లాంటి వాటి ధరలు తగ్గాలి కదా! తగ్గాయా? నీవు పండించే పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చారా? అవేమీ లేకుండానే ఆదాయం డబుల్ ఎలా అవుతుంది? పరిస్థితి దిగజారటం వల్లనే కదా రైతులు అప్పుల పాలవుతున్నది; ఆత్మహత్యలు చేసుకుంటున్నది. ఎంఎస్పి ఏమైపాయె? అమలు చేయని హామీ ఇచ్చిన పార్టీని ఏం చేయాలి?

- సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాం* : అంటే పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు. కానీ ఇచ్చినవి కేవలం 7 లక్షలు మాత్రమే. కేంద్ర ప్రభుత్వంలో పది లక్షల ఉద్యోగాలు ఖాళీగా పడి ఉన్నాయి. ఆ ఖాళీలను భర్తీ చేయటానికి నోటిఫికేషన్లు ఏవి? ఈ 10 ఏండ్ల కాలంలో లోపభూయిష్టమైన ఆర్థిక విధానాలతో 8,50,000 చిన్న ,మధ్యతరగ పరిశ్రమలను మూతపడేలా చేశారు. సగటున పరిశ్రమకు 100 మంది అనుకున్నా ఎనిమిది కోట్ల 50 లక్షల ఉద్యోగాలు హాం ఫట్ అయిపోయాయి. అంతమంది ఉద్యోగులు రోడ్డునపడ్డారు. వారి కుటుంబాలు ఏమైపోయాయో? ఉపాధి హామీ కూలీలకు సైతం 100 రోజుల పనిని ఇవ్వడం లేదు. బ్రతుక్కు గ్యారెంటీ ఇవ్వలేరు కానీ ‘మోడీకి గ్యారెం’టీ కావాలట! అమలు చేయని హామీ ఇచ్చిన పార్టీని ఏమి చెయ్యాలి?
- స్విస్ బ్యాంకుల్లో డబ్బును ప్రతీ వ్యక్తి బ్యాంకు ఖాతాకి 15 లక్షల రూపాయలు: క్యా దోస్త్ మీ ఖాతాలో 15 పైసలు అన్నా పడ్డాయా? సైబర్ నేరాలు పెరిగిపోయి మీ అకౌంట్ లోని డబ్బులు కూడా హుష్ కాకీయేనా? ఇదంతా “జుమ్లా” యేనా? అమలు చేయని హామీ ఇచ్చిన పార్టీని ఎక్కడికి తన్నాలి?
- పెద్ద నోట్ల ను రద్దుచేసి నకిలీ కరెన్సీని అడ్డుకుంటాం : ఫలితం ఏమీ రాలేదని పెదవి విరుచుకుంటున్నారు ఎందుకు? ఎన్ని నకిలీ నోట్లు బ్యాంకులకు చేరాయి? నిల్లా? పెద్ద నోట్లు ఉంటే నకిలీ నోట్లు మార్కెట్ లోకి వస్తాయని ఓ వైపున అంటూ ఇంకా అంతకన్నా పెద్ద నోట్లు ప్రింటు చేయడం ఏమి విజ్ఞత?
డబ్బు అందని కారణంగా వేల చిన్న పరిశ్రమలు, మూతపడి ఇక కోలుకోలేని పరిస్థితికి చేరినాయి. అవన్నీ మూసుకు పోయాయి కదా! ౦పర్యవసానాలను అంచనా వేయాలని వారు ద్రష్టలా? అలాంటి వారు పాలనకు తగుదురా? - . బేటి పడావో బేటి బచావో: హిజబ్ ని ధరిస్తున్నారు అనే కారణంతో ఎంతమంది ఆడపిల్లల్ని చదువులకు దూరం చేశారో?! వాళ్లు ముందు అమ్మాయిలు, ఆ తర్వాతే ముస్లింలు.. బిల్ కీస్ బానోని గ్యాంగ్ రేప్ చేసిన నేరస్తులను జైలు నుంచి విడుదల చేయటానికి ఎన్ని తంటాలు పడ్డారో! నేరస్తులకు సన్మానాలా? బిల్ కీస్ ముందు మహిళ ఆ తర్వాతే కదా ముస్లిం! ముక్కు పచ్చలారని మేకలు మేపుకునే బాలికను గర్భగుడిలో గ్యాంగ్ రేప్ చేసిన వారికి సపోర్టుగా బిజెపి కార్యకర్తలు జమ్మూ లో ఊరేగింపు తీశారే! మహిళా మల్ల యోధులపై అత్యాచారం చేసిన ఎంపి బ్రిజ్ భూషణ్ ను ఇంకా కాపాదుతూనే ఉన్నారు కదా! హత్రాసులో ఒక ఎస్సీ యువతిని గ్యాంగ్ రేప్ చేసిన వారిని రక్షణ కోసం పరుగుపెట్టారే! ఆ వార్త రాయడానికి వెళ్ళిన జర్నలిస్టు కప్పన్ మీకు దేశద్రోహిగా కనపడ్డాడా?! మణిపూర్లో కుకి మహిళలను నగ్నంగా ఊరేగించారు. అదీ మీకు కనిపించలేదా? రేపిస్టులకు మద్దతుగా నిలబడ్డ పార్టీని ఏమి చేయాలి?

.
- పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉన్నతమైంది దాన్ని కాపాడుతాం : ప్రతిపక్ష ఎంపీలను అందరినీ బయటికి గెంటేసో , మూజువాణీ ఓటుతోనో చట్టాలను ఆమోదింప చేసుకున్నారు . ఇది బిజెపి మార్కు ప్రజాస్వామ్యమా? నియంతృత్వమా? ఈ 10 ఏళ్లలో 411 మంది ఎమ్మెల్యేలను కొనుక్కుని ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చారు. కర్ణాటకే ఉదాహరణ.
- పరిపాలనలో పారదర్శకత, చట్టాల తయారీలో రాజ్యాంగ విలువల పరిరక్షణ : ఈ రెండూ చేస్తామని హామీ ఇచ్చారు.
పెద్ద నోట్ల రద్దు విషయంలో ఆర్బిఐ గవర్నర్ కే సమాచారం లేదుట. ప్రైమ్ మినిస్టర్ కేర్స్ ఫండ్ కి ఎంత డబ్బు వస్తుందో ఎలా ఖర్చు పెడుతున్నారో తెలుపవలసిన అవసరం లేదని ప్రైమ్ మినిష్టర్ ఆఫీసు ఒక సమాచార హక్కు చట్టం కింద పెట్టిన దరఖాస్తుకి సమాచారం ఇచ్చింది. ఆ నిధికి ఆడిట్ కూడా ఉండదట. సిబిఐ డైరెక్టర్ నియామకం, కేంద్ర సమాచార కమిషన్ నియామకం అన్ని రహస్యమేనా? ప్రతిపక్షాలను అణచివేయటానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా వాడుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నవారిపై దర్యాప్తు సంస్థలను ఉసిగొలిపి వారిపై దాడులు చేయించి,బిజెపి లో చేర్చుకొని, వారిని పవిత్రులుగా ప్రకటిస్తున్నారు. బిజెపి లో చేరిపోతే సమస్త పాపాలనుంచి మినహాయింపే! వాషింగ్ మిషన్ లోంచి బయటికి వచ్చిన బట్టల్లా ‘నిర్మా’ తెలుపుతో మెరిసిపోతారట మురికి అంతా వదలిపోయిన వారిలా! 29 కార్మిక చట్టాలు రద్దుచేసి నాలుగు కోడ్లను ప్రతిపక్షాన్ని పార్లమెంటు నుంచి బయటికి వెల్లగొట్టి మరీ ఆమోదింప చేసుకున్నారు. మూడు క్రిమినల్ చట్టాలనూ అలాగే చేశారు. యూ.ఏ పి ఏ. చట్టాన్ని మరింత క్రూరంగా తయారు చేశారు. ఖైదీలది గుర్తింపు చట్టాన్ని తొలగించి ప్రతి అనుమానితుడినీ నేరస్థుణ్ణి చేశారు. ప్రైవసీ హక్కు కు గుడ్ బై చెప్పేసారు… రాజ్యాంగ విలువలను ఆరు నిలువుల లోతున పాతేసిన పార్టీని ఎక్కడ పాతేయాలో?! - పళ్ళాలు మోగిస్తే కారోనా వైరస్ పరార్: కారోనా వైరస్ పళ్ళాలు మోగిస్తూ ‘పో కారోనా పో’ అంటే అది తోకముడుస్తుందని పళ్ళాలు మోగించారు. పాపం అమాయకులు నమ్మారు.వైరస్ విజృంభించగానే ఎలాంటి ప్లాన్ లేకుండా హఠాత్తుగా లాక్ డౌన్ ప్రకటించి సమస్త రవాణానూ స్తంభింప చేసారు. కాలినడకన వేల మైళ్ళు నడవలేక మధ్యలో నే మరణించిన వారికి లెక్కలే లేకుండా చేశారు. రైళ్లు నడవడం లేదు కదా అని రైలు పట్టాల మీద పడుకున్న నిర్భాగ్యులపైకి రైలు బండిని తోలి ఆ కార్మికులు దేహాలను ఖండ ఖండాలు గా మార్చారు. ఆక్సిజన్ లేకుండా ఆసుపత్రులను గాలికి వదిలేశారు. ఎక్కడినుంచో ఆక్సిజన్ సిలిండర్లను తెచ్చి పిల్లల ప్రాణాలను కాపాడిన కాఫీల్ ఖాన్ ను ‘ఉపా’ చట్టం తో సత్కరించారుగా!! ఒక విపత్తును తట్టుకోలేని సర్కారుని నడిపిన పార్టీకి మళ్లీ ఓటా?!
- సబ్కె సాథ్ సబ్కా వికాస్ : దేశంలోని కార్మికుల ,రైతుల, ఆదివాసీల, దళితుల, మహిళల, చిన్న పారిశ్రామిక వేత్తల వికాసం అని అర్థం కదా.
మరి దేశంలోని ఆర్థిక, ఆదాయ వనరులన్నిటినీ అంబానీ అదానీలకు కట్టబెడుతున్నారు ఎందుకో? మీకు వారిద్దరే సర్వస్వం! వారే మీకు సబ్!! వారి వికాసమే సబ్కా వికాస్!! బ్యాంకులను ముంచి పారిపోయిన బడా మోసగాళ్ళు అందరూ మీకు దోస్తులే. వారూ వికసించారు మోసగాళ్ల వికాసమే అందరి వికాసం అని మోసగించిన పార్టీని ఇంటికి పంపాలి కదా! - రిజర్వేషన్స్ సంగతేమిటి ? గోల్వాల్కర్ కి రిజర్వేషన్స్ ఇష్టం లేదు. కమలం పార్టీకి ఆయనే సిద్ధాంత కర్త. మతపరమైన రిజర్వేషన్లు ఉండవు అని మోడీ-షా లు పదేపదే అంటున్నారు. కులం కి మూలం మతం కాదా?! అంటే రిజర్వేషన్లు ఉండవు అని చెప్పడమే. బీజేపీ రిజర్వేషన్స్ ను తొలగిస్తుంది అనగానే కాదు కాదు అనడానికి మో-షా లు తెలంగాణాకు టూర్లు కొడుతున్నారు. రిజర్వేషన్లు ఉండవు అనే పార్టీని ఇంటికి పంపాలి కదా!
మోడీ నోట “మిత్రో ” అనే మాట వింటేనే మైనారిటీలకు భయం పుడుతోంది. ‘ఫిర్ ఏక్ బార్- మోడీ సర్కార్’ వస్తే దేశంలో నెలకొనేది నియంతృత్వమే. అప్పుడిక అవినీతికి హద్దులు ఉండవు. రాజ్యాంగ విలువలు ధ్వంసం అయిపోతాయి. అలా జరగకూడదు అనుకుంటే
బిజెపి ఓడాలి. ఇండియా కూటమి గెలవా లి.
