ఆవేశంతో కాదు ఆలోచన చేసి ఓటు వేయండి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. హన్వాడ మండలం టంకర గ్రామంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. డబుల్ బెడ్రూం ఇల్లు పేరుతో గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ మనలను మోసం చేసిందని, కానీ మీ ఆశీస్సులతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం రాముల వారి సన్నిధిలో అంకురార్పణ చేశారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలోని బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే , అర్హులైన ప్రతి లబ్దిదారునికి రేషన్ కార్డు ఇస్తామని, రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామని, సిలిండర్ ను ఐదువందలకే ఇస్తున్నామని , ఉచిత విద్యుత్ జీరో బిల్లు ఈనెల 13 నుంచి అమలు అవుతాయి అని, పంద్రాగస్టు లోగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకొంటారని పాలమూరు పౌరుషం కేసిఆర్ కు చూపించారని ఆయన స్పష్టం చేశారు. మూడు నెలల లోపే 30 వేల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఇచ్చారని, ఇంకా రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే బాధ్యత నాదే అని ఆయన హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గౌరవాన్ని పెంచేందుకు మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి గెలుపు కోసం ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో తిరుపతయ్య, మహేందర్, యంఎస్ఆర్, ఎంపిటిసి జాంగిరయ్య, టంకర కృష్ణయ్య, ఎన్ పి వెంకటేష్, వేముల కృష్ణయ్య, అచ్చన్న, బాలయ్య, నవనీత, యాదిరెడ్డి, లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.



